Sunday, 12 May 2019

అమృతమూర్తి

                                                        సంబంధ బాంధవ్యాల్లో ఎక్కువ శాతం స్వార్ధపూరితాలే కానీ అమ్మ ప్రేమ ఒక్కటే అందుకు మినహాయింపు.నిష్కల్మషమైన ప్రేమ అమ్మ స్వంతం.అందరికన్నా ముందు లేచి ఆఖరికి పడుకుంటూ ఆరోగ్యం బాగా లేకున్నా పనిచేస్తూ మనసు నొచ్చుకున్నా నవ్వేస్తూ అందరికీ అన్నీ అమర్చడం అమ్మకే సాధ్యం.అత్మీయతకు చిరునామా అమ్మ.ముమ్మాటికీ అమ్మకి అమ్మే సాటి.అమ్మ తన పిల్లలకే కాక పిల్లల పిల్లలకు కూడా సేవ చేసే అమృతమూర్తి.నిస్వార్ధంగా పిల్లల కోసం చేసే త్యాగాలు చాకిరీలకు అంతూదరీ ఉండదు.ఇంటి పనులకు విరామం విశ్రాంతి అనేది ఉండదు కదా!అమ్మ బాధ్యత మహా కష్టమైనది,క్లిష్టమైనది.అమ్మ ఓర్పుకి,నేర్పుకీ,నైపుణ్యానికి,ప్రేమకు ఏమి అవార్డు ఇవ్వగలం?అమ్మ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది.అమ్మకోసం కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు.అలసిసొలసిన వయసులో అమ్మను ప్రేమతో చూసుకోవడం మన బాధ్యత.అమ్మ సంతోషమే మనకు ఎంతో సంతృప్తి.కాసేపు అమ్మతో గడిపితే కొండంత  ప్రేమ మన స్వంతమవుతుంది.స్వేచ్చగా ,సంతోషంగా మనసులోని భావాలన్నీ పంచుకోగలిగేది ఒక్క అమ్మతో మాత్రమే.అమ్మతో మాట్లాడితే ఎక్కడ లేని నిశ్చింత.మనసుకి ప్రశాంతత.తరాల అంతరంతో ఎవరైనా అమ్మా నీకేమీ తెలియదు నువ్వు మాట్లాడకు అని కసిరితే  వాళ్ళ పిల్లలతో తిరిగి కసిరించుకోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకుంటే మంచిది.పెద్దయ్యాక పిల్లలు ఆర్ధికంగా ఎదిగితే కుళ్ళు కుతంత్రాలు లేకుండా సంతోషపడేది ఒక్క అమ్మ మాత్రమే.దేశానికి రాజు అయినా అమ్మకు కొడుకే అన్నట్లు ఎవరు ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా అమ్మకు కొడుకు,కూతురు మాత్రమే.ఆ అమృతమూర్తికి సంతోషంగా,ప్రేమతో సేవ చేసే భాగ్యాన్ని,సమయాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని ఈరోజే కాకుండా ప్రతిరోజు మాతృదినోత్సవం అనుకోవాలని కోరుకుంటూ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.   

No comments:

Post a Comment