Monday 10 June 2019

ఒక్కసారి ఆలోచించండి

                                                                  ఈమధ్య ఎక్కువ మంది తమ బిడ్డ కడుపులో పడ్డ నాటి నుండి వాళ్ళను ఎంత గొప్పగా పెంచి అందరికన్నా గొప్ప వాళ్ళను చేసి అందలం ఎక్కిద్దామా అని అదే పనిగా ఆలోచించి తెగ హైరానా పడుతున్నారు.మరి మన అమ్మానాన్నలు అంతకన్నా ఎక్కువ కష్టపడితేనే కదా!మనము ఇంత వాళ్లము అయింది అని ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది.ఇప్పుడున్న సౌకర్యాలు,అవకాశాలు కూడా అప్పట్లో అందుబాటులో ఉండేవి కాదు.ఈ రోజుల్లో ఆదాయం పెరిగింది కనుక పిల్లలు ఆడింది ఆట పడింది పాటగా అడిగిందే తడవుగా కొండ మీద కోతిని కూడా తెచ్చి ఇవ్వగలుగుతున్నాము అని అనుకుంటున్నారు.కానీ ఈ హడావిడి జీవితాల్లో పిల్లల కోసం ఎంత మంది తగిన సమయాన్ని కేటాయించి పూర్తి ప్రేమ,ఆప్యాయతను పంచగలుగుతున్నారు?మన అమ్మ చెప్పేది సొల్లు,నాన్న చెప్పేది సోది అనుకునే రోజులు.అమ్మానాన్నలు,అవ్వాతాతలు మిగిలిన బంధువర్గంతో కలిసిమెలిసి ఉండి అందరి మధ్య పెరగడంతో వాళ్లందరూ ఎన్నో మంచి బుద్దులు,సంస్కారం నేర్పితేనే పెద్ద వాళ్ళను పట్టించుకోవట్లేదు కొంతమంది.అమ్మానాన్నలతో మాత్రమే కలిసి ఉండే ఇప్పటి పిల్లలకు వెనుకటి ప్రేమ,ఆప్యాయతల విలువ ఏమి తెలుస్తుంది?అప్పట్లో అందరితో కలిసి పెరగటంతో చిన్నప్పటి నుండే సర్దుబాటు తత్వం,ఉన్నదానిలోనే  ఎదుటివారితో కలిసి పంచుకుని తిందాం అనే  ఆలోచన ఉండేది.అటువంటి కుటుంబ నేపధ్యంలో పెరిగి కూడా ఇప్పుడు తల్లితండ్రి అని కూడా పట్టించుకోవడంలేదు.రక్తసంబంధీకుల్లోనే ఎదుటివారిది కూడా తామే లాగేసుకుని తినేసేలా  ఉంది ఇప్పటి పరిస్థితి.నేను,నాది,నా పిల్లలు మాత్రమే అనే స్వార్ధం ఎక్కువైపోయింది.ఈరోజు మనం చేసినట్లే రేపు వాళ్ళు కూడా చేస్తారు కదా!అందుకే అటువంటి ఇరుకు మనస్తత్వాన్ని,సంకుచిత స్వభావాన్నివదిలిపెట్టి విశాల దృక్పధాన్ని అలవర్చుకుని పిల్లలకు కూడా చదువుతోపాటు పెద్దలు,తోటివారి పట్ల గౌరవం, సంస్కారం,సంప్రదాయాలు నేర్పితే పిల్లలకు పెద్దలకు కూడా ఎంతో శ్రేయస్కరం.మనం ఎంత డబ్బు ఇచ్చాము అన్నది లెక్క కాదు.ఎంత సంస్కారవంతంగా పెంచాము అన్నది లెక్క.మనకు పిల్లలు ఎంతో పెద్దలు కూడా అంతే ముఖ్యం కదా!ఒక్కసారి ఆలోచించండి.దీన్ని చదివి కొంతమందిలో అయినా మార్పు వస్తుందని  ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment