సుశ్రుతి వీసా కోసం కుటుంబంతో కలిసి యు.కె దౌత్య కార్యాలయానికి వెళ్ళింది.అప్పటికే అక్కడ ఒక అరవై మంది ఉన్నారు.సుశ్రుతి వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చున్నకాసేపటికి ఒక పెద్దాయన మాటలు కలిపి పరిచయ కార్యక్రమాలయ్యాక మాటల మధ్యలో మేమందరమూ పిల్లల బాధిత సంఘం సభ్యులము అంటూ అందరినీ పరిచయం చేశారు.అందరూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.అందరూ కలిసి ఒక్కొక్కసారి కొన్నికొన్ని దేశాలు చొప్పున చూడటానికి వెళ్తుంటాము అని చెప్పారు.సుశ్రుతి ఆశ్చర్యంగా ఆయనను చూచేసరికి అదేనమ్మా మా పిల్లలందరూ చదువుకుని మళ్ళీ మన దేశానికి వచ్చేస్తాము అని చెప్పి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు.ఏమి చేస్తాము?మేమందరము కలిసి ఇలా సంవత్సరానికి ఒకసారి దేశాలు పట్టుకుని ముఖ్యమైన ప్రదేశాలు తిరుగుతున్నాము అని చెప్పారు.వాళ్ళు ఇక్కడికి రారు మేము అక్కడ ఉండలేము.ఇక్కడి డబ్బు వాళ్ళకి అవసరం లేదు.అందుకే ఈ వీసా తిప్పలు.మేమందరమూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరం అండగా ఉంటాము.సంతోషం అయినా,బాధ అయినా అందరం కలిసే పంచుకుంటాము.ఒకవైపు పిల్లలు దగ్గర లేరనే బాధ ఉన్నా ఇంకో వైపు ఇలా మేము అందరం కలిసిమెలిసి ఉండడం సంతోషాన్నిస్తుంది అని ఆయన చెప్పారు.పిల్లలు దూరాన ఉన్నారని ఈ వయసులో ఎలా ఉండాలో?అని బాధపడుతూ కూర్చోకుండా అందరూ సరదాగా,సంతోషంగా ఉండడం చాలా బాగుంది అని సుశ్రుతి చెప్పింది.బాధని కూడా సంతోషంగా సానుకూల ద్రుక్పధంతో అనుకూలంగా మార్చుకోవడమే కాక చతురతతో మాట్లాడడం సుశ్రుతికి బాగా నచ్చింది.పిల్లలు దగ్గర లేకపోయినా మలి వయసులో మా పరిస్థితి ఎలా?అనుకునే తల్లిదండ్రులకు,అమ్మానాన్న ఎలా ఉన్నారో?అని బాధపడే పిల్లలకు స్పూర్తిదాయకం అనుకుంది సుశ్రుతి.
No comments:
Post a Comment