Wednesday, 13 April 2016

శిరస్త్రాణము ధరించి ఉంటే........

                                                                   ద్విచక్ర వాహనంపై  వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తలపై శిరస్త్రాణము పెట్టుకోవాలని తెలిసినా ఇప్పుడే వస్తాము కదా!అని కొందరు,తలపై బరువు అని కొందరు,జుట్టు అణిగిపోతుందని కొందరు మొత్తం మీద ఏ కారణమైనా కానీ 75 శాతం మంది అసలు ఉపయోగించరు.ప్రభుత్వం తప్పనిసరిగా ధరించాలని నిబంధన పెట్టినా,మన రక్షణ కోసమే అని తెలిసినా,జరిమానా కట్టటానికి సిద్ధమే కానీ,దానివల్ల ఒక్కొక్కసారి ప్రాణాన్ని ఫణంగా పెట్టాల్సోస్తుందనే ఆలోచన రాదు.చిన్ననిర్లక్ష్యం ఫలితం కుటుంబం మొత్తానికి భాధ.
                                                         సత్యప్రకాష్ స్వతహాగా చాలా మంచి వ్యక్తి.ఈ మధ్యనే దైవ సేవలో ఎక్కువ
సమయం గడుపుదామని నిర్ణయించుకున్నాడు.శ్రీరామ నవమి సందర్భంగా గుడి వద్ద ఏర్పాట్లు చూస్తుండగా ఒక ఫోన్ కాల్ వచ్చింది.ఇప్పుడే వస్తానని అక్కడి వాళ్ళకు చెప్పి వెళ్ళాడు.ఒక అరగంట లోపే ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా మద్యం సేవించి ముగ్గురు కుర్రాళ్ళు మోటారు సైకిలు మీద వస్తూ సత్యప్రకాష్ వాహనాన్నివేగంగా డీ కొట్టారు.కన్ను మూసి తెరిచే లోపల సత్యప్రకాష్ క్రిందపడి తలకు దెబ్బ తగిలి ముక్కు,చెవులు,నోటిలో నుండి రక్తం రావటమే కాక కాళ్ళు రెండు విరిగిపోయాయి.ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన కొద్దిసేపటికి చనిపోయాడు.కాళ్ళు విరిగితే శస్త్రచికిత్స చేస్తే కొద్దిరోజులకు మాములుగా తిరిగేవాడు.అదే శిరస్త్రాణము ధరించి ఉంటే తలకు దెబ్బ తగిలేది కాదు.ప్రాణం దక్కేది.ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు,భార్యాపిల్లలకు ఈవార్త తెలిసేసరికి గుండెలు పగిలిపోయాయి.వాళ్ళకే కాదు అందరికీ పెద్ద షాక్.ఆ కుటుంబం భాధ ఎవరు తీర్చగలరు.ఎంతమంది ఉన్నా అతను లేని లోటు ఎలా పూడ్చగలరు?రోడ్డు మీద మనం సరిగా వెళ్ళినా పక్కవాళ్ళు వచ్చి మీద పడినా మనకే ప్రమాదం కనుక ఎవరికి వారే రక్షణ ఏర్పాటు చేసుకోవాలి.శిరస్త్రాణము ధరించితే ప్రాణహాని తప్పుతుంది.  

No comments:

Post a Comment