Saturday 26 October 2019

దివ్వె దివ్వె దీపావళి వెలుగులు

                                                       దీపావళి అంటేనే పిల్లల పండుగ.దీపాల పండుగ.పిల్లలు ఎక్కువ దీపాలు ఎవరు ఇంటి ముందు పెడితే వాళ్ళు గొప్ప అని పోటీ పడి మరీ వెలిగించేవారు.ఆ మధ్య కాలంలో కొంత మంది మధ్య మధ్యలో కొవ్వొత్తులు పెట్టడం మొదలెట్టారు.దీపావళికి నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం మంచిదని పెద్దలు,పండితులు చెప్పడంతో ఈమధ్య నూనె దీపాలు వెలిగిస్తున్నారు.దివ్వె దివ్వె దీపావళి అంటూ ఒకప్పుడు పిల్లలందరూ ఒకచోట చేరి సరదాగా ఆటలాడుతూ ఉండేవారు.ఒక నెల ముందు నుండే పిల్లల హడావిడి అంతా ఇంతా కాదు.పెద్దవాళ్ళు కూడా కొంతమంది కలిసి పిల్లల కోసం స్వయంగా చిచ్చుబుడ్లు,మతాబులు,అవ్వాయ్ సువ్వాయ్ లు,దివిటీలు రకరకాలు తయారు చేసి ఇచ్ఛేవాళ్ళు.పిల్లలకు పగలంతా వాటిని ఎండబెట్టే కార్యక్రమం సరిపోయేది.వాటిని అందరూ తలా కాసిని పంచుకునేవాళ్ళు.ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు బయట తెచ్చి టపాకాయలు కాల్చడంతో ప్రమాదాలు జరగటమే కాక అవి సరిగా వెలగకపోవడంతో పాటు శబ్ద కాలుష్యం ఎక్కువైపోవడంతో పిల్లలకు కూడా అంతగా ఆసక్తి ఉండడం లేదు.టపాకాయల రసాయన వాసనలు,శబ్దాల కన్నా దీపాల వెలుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇల్లంతా దీపాల వెలుగులు ప్రకాశించినట్లే లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మన యందు ప్రసరించి మీ మా మనందరి జీవితాలు ప్రకాశవంతంగా వెలిగిపోవాలని,ఆయురారోగ్యఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

No comments:

Post a Comment