Saturday 5 November 2016

మూడు పేర్లు పిల్ల

                                                      విజయ లక్ష్మి కుమారి  ఊరిలో ఒక పెద్దాయన ఆయన వయసుకు తగిన పనులు ఏదో ఒకటి చేసుకోగలిగినా సోమరితనంగా ఊరికే రచ్చబండ దగ్గర కూర్చునేవాడు.తను ఖాళీగా కూర్చునేది కాక దారిలో వెళ్ళే వచ్చే వాళ్ళను పలకరించి అబ్బాయ్ కాసేపు వచ్చి కూర్చో అని పిలిచేవాడు.ఒకటి రెండుసార్లు వెళ్ళినా ఈయన ధోరణికి విసుగు వచ్చి వినపడనట్లు వెళ్తుంటే వచ్చేవరకు పెద్దగా అరచి పిలవడం మొదలు పెట్టాడు.ఈయన ధాటికి తట్టుకోలేక అందరూ వేరేదారిలో వెళ్ళటం మొదలు పెట్టారు.ఎవరూ ఈయన సొద వినటం లేదని ఆడుకునే పిల్లలను పిలిచి మీ అమ్మా నాన్నా పోట్లాడుకుంటారా?అంటూ చెత్త ప్రశ్నలు వేసేవాడు.ఒకరోజు విజయలక్ష్మికుమారి ఇంటికి బంధువులు వచ్చారు.వాళ్ళను రచ్చబండ మీదుగా ఇంకొక చుట్టాలింటికి తీసుకుని వెళ్తూ పెద్దాయన కంట పడింది.వాళ్ళందరి ముందు మూడు పేర్లు పిల్లా!ఒకసారి ఇటు వచ్చి వెళ్ళు అంటూ పిలిచాడు. చిన్నపిల్ల అయినా అసలే ఆమెకు రోషం ఎక్కువ.బంధువుల పిల్లలు నిన్నుఅలా పిలుస్తున్నాడు ఏమిటి?అంటూ దీర్ఘం తీశారు.అసలే కోపం వచ్చింది దానికి తోడు వాళ్ళు కూడా మాట్లాడేసరికి ముఖం కందగడ్డలా పెట్టి తాతా!నా పేరులో మూడు పేర్లు కలిసి ఉన్నంత మాత్రాన నువ్వు నన్ను మూడు పేర్లు పిల్ల అని పిలిచావంటే మాత్రం ఊరుకోను అంటూ గట్టిగా కొత్త వాళ్ళందరి ముందు అరిచేసరికి అవాక్కయ్యాడు.తాతా!వింటున్నావా?అంటూ చేతులు పట్టుకుని గట్టిగా మనిషిని ఊపేస్తూ సరే ఎప్పుడూ అనను అనేవరకు వదలలేదు.దాంతో పెద్దాయన కొత్తవాళ్ళు ఉన్నారని కిక్కురుమనకుండా అవతలకు వెళ్ళిపోయాడు.హమ్మయ్య!ఈ దెబ్బతో ఈయన బెడద వదిలింది లేకపోతే అందరినీ ఏదో ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటూ ఊరిలో పిల్లలు అందరూ హర్షం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment