Wednesday 14 December 2016

కోపంతో ముందడుగు

                                                                   లతాశ్రీ తెలివైనదే కానీ చదువంటే మాత్రం మహా బద్ధకం.చిన్నప్పుడు పుస్తకాలు తీసి చదవమంటే ఆమడ దూరం పరుగెత్తేది.ఎలాగోలా వచ్చే పరీక్షకు,పోయే పరీక్షకు నాలుగుసార్లు రాసి పదవ తరగతి అత్తెసరు మార్కులతో గట్టెక్కింది.తర్వాత పెళ్ళి,పిల్లలు.అత్తింటి వారికి ఆస్తులున్నావ్యాపారానికి డబ్బు దండిగా ఇవ్వలేదని కోపం వచ్చి ఫాషన్ డిజైనింగ్ చేసి తన బంగారం అమ్మేసి మరీ కొంతమంది పనివాళ్ళను పెట్టుకుని మగ్గం వర్కు,డిజైనర్ జాకెట్లు కుట్టించడం మొదలు పెట్టింది.భాష రాకపోయినా నానా తంటాలు పడి వేరే రాష్ట్రం నుండి పనివాళ్ళను పిలిపించి జాకెట్లు అందంగా కుట్టించడంతో తెలిసిన వాళ్ళు,బంధువులు,స్నేహితులు వరుసగా కుట్టించుకోవడం మొదలు పెట్టారు.ఆదాయం పెరగటంతో భర్త కూడా తన ఉద్యోగం వదిలేసి భార్యకు చేదోడువాడుగా ఉండటంతో ఉప్పాడ,మంగళగిరి,ధర్మవరం,కంచి,కలకత్తా,పోచంపల్లి,సూరత్ నుండి ఎక్కడ ఏవి ప్రత్యేకంగా దొరికుతాయో అక్కడికి వెళ్ళి అవి తెచ్చి చీరల దుకాణం పెట్టేసింది.ఆనాడు కోపంతో ముందడుగు వేయడంతో అప్పుడు ఎగతాళిగా మాట్లాడిన నోళ్లతోనే ఇప్పుడు పొగడ్తల జల్లు కురిపించి లతాశ్రీ స్వశక్తితో పైకి వచ్చిందని,రెండు దుకాణాలు పెట్టిందని ఆకాశానికి ఎత్తుతున్నారు. 

No comments:

Post a Comment