Friday, 24 February 2017

మంచిని మెచ్చుకో

                                                 రుద్రమ్మకు నోటి దురుసు బాగా ఎక్కువ.దీనితోపాటు సణుగుడు సంగతి సరేసరి.పిల్లాది మొదలు పెద్దవాళ్ళను కూడా ఏదోఒకటి కుంటి మాటలు మాట్లాడనిదే వదలదు.పక్కింట్లో ఆకు కదిలినా అన్నీ తనకే కావాలి.గిన్నెల శబ్దం వచ్చినా వేళాపాళాలేదు మోతలు చేయడానికి అని సణుగుతూ ఇంకో పక్కింటి వాళ్ళకు చెప్తూ ఉంటుంది.ఎదురింట్లో,పక్కింట్లో శబ్దాలు రాకూడదు కానీ తన ఇంట్లో పిల్లలు అరిచి అల్లరి చేసినా చేయొద్దని ఆమె అనదు.ఎవరూ ఏమీ అనకూడదు.ఆవిడ సంగతి తెలియక ఎవరైనా అన్నారంటే వాళ్ళ పని గోవిందా!ఆవిడనోట్లో నోరు పెట్టి గెలవడం సాధ్యమా?ఎదుటి వాళ్ళు ఏమీ అనకుండానే తనే పోట్లాడి,వాళ్ళను సతాయించి చట్టిలో పెడుతుంది.ఇలా తెల్లారిందో లేదో అలా పెద్ద గొంతుతో పనివాళ్ళను అరుస్తూ నానా గందరగోళం సృష్టిస్తుంది.పండుగ సందర్భంగా పిండి వంటలు పెడితే పెట్టవచ్చు లేకపోతే లేదు అంతేగానీ ఏమేవ్!సాయంత్రం వచ్చేటప్పుడు నీ గిన్నెలు తెచ్చుకో లేకపోతే నీ వీపు పగలగొడతా!ఏంటనుకున్నావో అని అరవటం అంత అవసరమా?నిదానంగా చెప్పినా సరిపోతుంది.ఆవిడ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత  చిట్టా తయారవుతుంది.ఆ నోటి దురుసు లేకపోతే ఆవిడ చాలా మంచిది.కల్మషం అనేది లేని నిష్కల్మష మనస్తత్వం.కుళ్ళు,కుతంత్రాలు తెలియవు.ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఆదరా బాదరా పరుగెత్తుకుని వచ్చేస్తుంది.పక్క వాడికి ఏమి జరిగినా మనకెందుకులే అనుకునే రోజుల్లో రుద్రమ్మ లోని ఈ గుణం మెచ్చదగినది.
సూచన:చెడ్డ వాళ్ళయినా వాళ్ళల్లో ఉన్న మంచిని గుర్తించి మెచ్చుకోవాలి.కొన్నాళ్లకయినా వాళ్ళల్లో మార్పు రావచ్చు.

No comments:

Post a Comment