Monday, 31 August 2015

ఆరోగ్య పానీయం

                                                      అమృతం తాగితే మృత్యుంజయులు అయినట్లుఈ ఆరోగ్య పానీయం రోజూ పరగడుపున అల్పాహారానికి ముందు తాగితే ఎన్నో రోగాలను తరిమి కొట్టగలుగుతారు.ముఖ్యంగా కాన్సర్ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు,అధిక రక్తపోటు వంటివి రాకుండా నిరోధించి ఆరోగ్యంగా ఉంటాము.ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కారట్ - 1,బీట్ రూట్ - సగం ముక్క (మధ్యరకం),యాపిల్ - 1 (మధ్యరకం).ముందుగా బీట్ రూట్  రసం తీసుకుని చల్లగా కావాలంటే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు.లేదంటే బీట్ రూట్ కారట్,కొంచెం నీళ్ళుపోసి రసం తీసి తర్వాత యాపిల్ వేసి ఈ మూడింటినీ కలిపి ఒక గ్లాసు రసం అయ్యేలా చేసుకుని వడకట్టి ఉదయాన్నే పరగడుపున తాగాలి. 

కుందేళ్ళతో ఆడటానికి వెళ్ళి...........

                                                              బన్నూకి ఐదు సంవత్సరాలు.వాడికి కుందేళ్ళు అంటే చాలా ఇష్టం.వాళ్ళ ఇంటి పైన మూడో అంతస్తులో వాళ్ళు రెండు తెల్లటి కుందేళ్ళను పెంచుకుంటున్నారు.రోజూ పాఠశాల నుండి రాగానే పైకి వెళ్ళి వాటితో కాసేపు ఆడుకుంటాడు.రోజూ వెళ్ళినట్లే ఆరోజు కూడా వెళ్ళాడు.చాలా సమయం గడిచినా ఇంటికి రాకపోయేసరికి బన్నూ అమ్మ పైకి వెళ్ళింది.ఎక్కడ వెతికినా బన్నూ కనిపించలేదు.పైనుండి క్రిందికి చూచేసరికి బన్నూ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.వాళ్ళ అమ్మ దిగ్బ్రాంతికి గురయి నోటమాట రాక సైగలు చేస్తుంది.ఈలోపు అందరూ పోగయి వెళ్ళి చూచేటప్పటికే బన్నూ చనిపోయి ఉన్నాడు.చక్కగా ఆడుకునేవాడు ఇంతలో ఇలా అయిపోయాడేమిటా?అని చు ట్టుపక్కల వాళ్ళకే చాలా బాధగా ఉంది.తల్లిదండ్రుల బాధ చెప్పనలవి కాదు.ఏ నిమిషం ఏమి జరుగునో అన్నట్లుగా ఉంటుంది.

పొట్ట తగ్గాలంటే .........

                ఉలవ పిండి - 50 గ్రా.
                నీళ్ళు - 1/2 లీ
                అల్లం - చిన్న ముక్క
                 జీర పొడి - 1  గ్రా.
                 సైంధవ లవణం - 2 గ్రా.
                  మిరియాల పొడి - 1 గ్రా.
                                 ఉలవ పిండి తప్ప నీళ్ళు.మిగతా అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత ఉలవ  పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి గడ్డ కట్టకుండా గరిటెతో తిప్పుతూ జావ లాగా కాచుకుని రోజు సాయంత్రం 4-5గం.ల మధ్యలో తాగాలి.ఈవిధంగా చెయ్యటం వలన పొట్ట తగ్గుతుంది.సాగిన పొట్ట దగ్గరకు వస్తుంది.

Sunday, 30 August 2015

లేలేత కొబ్బరి ఐస్ క్రీమ్

చిక్కటి పాలు - 2 కప్పులు
మొక్కజొన్న పిండి - 3 టేబుల్ స్పూనులు
పాలపొడి - 1 1/2 కప్పు
పంచదార - 1/2 కప్పు
క్రీమ్ - 1 1/2 కప్పు
లేలేత కొబ్బరి - 1 కప్పు
కొబ్బరి నీళ్ళు  - 1/2 కప్పు
                                                      ముందుగా పాలు,పంచదార కలిపి ఒక గిన్నెలో పోసి చిన్న మంటపై గరిటెతో
కలుపుతూ మరిగించాలి.పాలు మరిగిన తర్వాత 1/2 చల్లటి పాలల్లో మొక్కజొన్న పిండి వేసి మరిగిన పాలల్లో కలిపి గడ్డలు కట్టకుండా త్రిప్పుతూ ఉండాలి.స్టవ్ కట్టేసి గోరు వెచ్చగా అయ్యేవరకు చల్లార్చాలి.పాలపొడి వేసి బాగా కలిపాలి.
దీన్ని గాలి చొరబడని ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రీజర్ లో4- 5 గం.లు  ఉంచాలి.తర్వాత గడ్డకట్టిన పాల పదార్ధము తీసి10-20 సెకన్లు ఓవెన్లో పెట్టాలి.కొద్దిగా కరిగిన తర్వాత దీన్ని పెద్ద గిన్నెలో వేసి కొబ్బరినీళ్ళు,లేత కొబ్బరి,క్రీమ్,వేసిబాగా  కలపాలి.దీన్ని బీటర్ తో 10 ని.లు వేగంగా గిలకొట్టాలి.అప్పుడు బాగా నురగ వచ్చి పదార్ధం 3 రెట్లు అదికంగా పెరుగు తుంది.దీన్ని మరల గాలి చొరబడని డబ్బాలో వేసి పల్చటి మైనపు పొర వేసి మూతపెట్టాలి.దీన్ని మరల ఫ్రీజర్ లో7-8 గం.లు ఫ్రీజర్ లో పెట్టాలి.నోరూరించే లేలేత కొబ్బరి ఐస్ క్రీమ్ తయారయినట్లే.కావాలనుకుంటే ఎండు ఫలాలను ముక్కలు కత్తిరించి అందంగా అలంకరించి తినవచ్చు.  

Saturday, 29 August 2015

తెలుగు వెలుగు

                                                భావవ్యక్తీకరణకు తెలుగు భాషను మించిన మధురమైన భాష మరొకటి లేదు.తేనెలూరే మధురమైన,కమ్మనైన భాష తెలుగు.ఏ ప్రాంతానికి,ఏదేశానికి వెళ్ళినా మన మాతృభాషను మర్చిపోకూడదు.పొరుగు రాష్ట్రాలకు వెళితే మనం ఏభాష మాట్లాడినా వాళ్ళు మాత్రం వాళ్ళ మాతృ భాషలోనే సమాధానం చెప్పి మాతృభాషపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకుంటారు.ఇతర భాషలు అవసరం రీత్యా ఎన్ని నేర్చుకున్నామాతృ భాషను విస్మరించకూడదు.ఏదేశంలో ఉన్నా పిల్లలకు మాతృభాష తప్పకుండా నేర్పాలి.మన దేశంలో ఉన్న పిల్లలకే తెలుగు సరిగా రావటం లేదు.కనుక ప్రతి ఒక్కరు తమ పిల్లలకు మాతృ భాషపై పట్టు ఉండేలాచూడాలి.
                      .
 
అన్న నానుడిని నిజమని నిరుపించాలి పర భాషా వ్యామోహం ఉన్నా తెలుగు  భాషను పరిరక్షించి తెలుగుకు వెలుగునిద్దాము.

Friday, 28 August 2015

రోజుకో జామ పండు

                                                            రోజుకో జామ పండు తింటే ఎన్నో పోషకపదార్ధాలు మన సొంతం.వీటిలో చక్కర పదార్ధాలు,కొవ్వులు ఉండవు కనుక బరువు తగ్గాలనుకునేవాళ్ళకు,మధుమేహం ఉన్నవాళ్ళకు ఎంతో మంచిది.గుండె జబ్బుల్ని,రక్తపోటుని నియత్రించడమే కాక క్యాన్సర్ కణాలను కూడా నిర్వీర్యం చేస్తుంది.థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది.అప్పుడే కోసిన దోర జామ పండు రుచే వేరు.జామ ఆకులు నీళ్ళల్లో మరిగించి ఆనీళ్ళతో పుక్కిలి పడితే దంత సమస్యలు తగ్గుతాయి.జామకాయతో పచ్చడి ఇంతకు ముందే పోస్ట్ చేశాను.జామకాయలతో హల్వా,జామ్, రకరకాల పానీయాలు తయారుచేసుకోవచ్చు.

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

                                     అక్కాతమ్ముళ్ళకు,అన్నాచెల్లెళ్ళకు రక్షాబంధన్ శుభాకాంక్షలు
     
                                             
                                  

ముందుగా కష్టమైన పనులు

                                                        కార్యాలయంలోనయినా,ఇంట్లో అయినా  కొన్ని కష్టమైన పనులు,కొన్నితేలిక పనులు ఉంటాయి.ముందుగా కష్టమైన పనులు ఉదయం మొదలు పెట్టుకోవాలి.ఉదయాన్నే అటువంటి పనులు చేయటం వలన ఒత్తిడి తగ్గుతుంది.త్వరగా పూర్తి చేయగలుగుతారు.మిగిలిన వాటిని కంగారు పడకుండా నిదానంగా చేసినా తేలికగా పనులన్నీ పూర్తవుతాయి.

రోజూ ఒక గుప్పెడు శనగలు

                                                                మనం గుడికి వెళ్ళినా,పేరంటానికి వెళ్ళినా శనగలు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు.వీటిల్లో ఎన్నో పోషక పదార్ధాలు ఉంటాయి.చెడు కొలెస్టరాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.అధిక బరువును తగ్గించి శరీరం చురుగ్గా ఉండేలా చేస్తాయి.రక్తహీనతను పోగొడతాయి.రోజూ ఏదో ఒక రూపంలో ఒక గుప్పెడు శనగలు నానబెట్టి ఉడికించి తింటే శరీరానికి కావాల్సిన పోషక పదార్ధాలు అందించి అనారోగ్యాల బారినుండి కాపాడతాయి.

ముఖం తాజాగా......

                                                                    ఒక స్పూను కారట్ రసం,1/2 స్పూను తేనె,1/2 స్పూను పాల మీగడ,2 చుక్కలు ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాయాలి.ఒక పది ని.ల తర్వాత చల్లటి నీటితో ముఖం కడగాలి.వెంటనే అప్పటికప్పుడు ముఖం తాజాగా కనిపిస్తుంది.

అసలు వయసు కన్నా తక్కువగా ..........

                                                            కొంతమంది వాళ్ళ  అసలు వయసు కన్నా తక్కువ వయసులాగా కనిపిస్తుంటారు.అదెలా సాధ్యమంటే ఆహారంలో నూనె పదార్ధాలు తగ్గించి పండ్లు,కూరగాయలు,పెరుగు,పాలు,తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.కొంచెంసేపు ధ్యానం,వ్యాయామం చేయాలి.ఉన్నంతలో ప్రశాంతంగా,సంతోషంగా తృప్తిగా జీవించాలి.దానితో పాటు అప్పుడప్పుడు కుటుంబంతో విహారయాత్రలకు వెళ్ళి వస్తుండాలి.సంవత్సరంలో ఒకసారి వెళ్ళినా అందరూ కలిసి ఉల్లాసంగా,ఉత్సాహంగా గడపటం వల్ల ఆ సంతోషం తాలుకు ప్రభావం మనసుపై చాలా రోజులు ఉంటుంది.ఏదో పోగొట్టుకున్నట్లు,కోపంగా,చిరాకుగా ఉండే వాళ్ళకన్నా,ప్రశాంతంగా,సంతోషంగా ఉండే వాళ్ళు అసలు వయసు కన్నా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తారు.

వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

                                నా బ్లాగ్ వీక్షించ వచ్చే మహిళా వీక్షకులకు,తోటి మహిళా బ్లాగర్లకు,మహిళామణులందరికీ  వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు 

                                                   

రావమ్మా మహాలక్ష్మి

                                                లక్ష్మిదేవి అలంకార ప్రియురాలు.వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటిని మామిడితోరణాలతో, రకరకాల రంగుల పువ్వులతో,పూదండలతో ఎంత అందంగా అలంకరిస్తే అంత శుభం జరుగుతుందని నమ్మకం. ప్రత్యేకించి చామంతి పువ్వులతో అమ్మవారికి పూజ చేయడం ఆచారం.ఐదు రకాల పువ్వులు,ఐదురకాల పండ్లు ఐదు రకాల పిండి వంటలు తప్పనిసరి.ఆపై ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు.వాయనానికి తొమ్మిది పోగుల తోరము,తొమ్మిది పూర్ణాలు తప్పనిసరి.నిష్కల్మషంగా,నిర్మలమైన మనస్సుతో మా ఇంటికి రావమ్మా మహాలక్ష్మీ అంటూ మనస్పూర్తిగా ఆహ్వానించి లక్ష్మిదేవిని పూజిస్తే అంతా శుభమే.మహాలక్ష్మి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.స్త్రీలు సౌభాగ్యంగా ఉండాలని,తన కుటుంబం ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో తులతూగాలని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు.ఈ వ్రతంలో లక్ష్మీపార్వతుల సమన్వయం కనిపిస్తుంది.స్త్రీలు ఒకరికొకరు సఖ్యతతో ఎలా ఉండాలో తెలియచెప్పే వ్రతం.తోటి వారంటే గౌరవం,ప్రేమ ఉండి అందరితో సత్సంబంధాలు కలిగి సంతోషంగా ఉండేవారి దగ్గర, డబ్బును గౌరవించి,పూజించి,విలువ తెలిసిన వాళ్లదగ్గర మాత్రమే లక్ష్మీదేవి కలకాలం నిలుస్తుంది.డబ్బంటే నిర్లక్ష్యం అసలు ఉండకూడదు.అందరి దగ్గర లక్ష్మీదేవి కలకాలం ఉండాలని,అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలని ప్రార్ధిద్దాము.

Thursday, 27 August 2015

అధిక రక్తపోటు ఉంటే.......

                                                         అధిక రక్తపోటు ఉన్నవాళ్ళు ఉప్పు తగ్గించి తినడంతోపాటు దంపుడు బియ్యం,తృణ ధాన్యాలతో చేసిన పదార్ధాలు తినడం మంచిది.ఓట్స్ ఏదో ఒక రూపంలో దోశ,ఇడ్లీ,ఉప్మా,పులిహోర లడ్డూ,పులావ్ రకరకాలుగా ఇష్టమైన రీతిలో చేసుకుని తినవచ్చు.ఈ విధంగా పాటిస్తే అధిక రక్తపోటు,బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

ముఖం అందంగా.........

                                                                    టొమాటో ముక్క గుండ్రంగా కోసి దానిపై ఒక చుక్క తేనె వేసి ముక్క మొత్తం ఒకవైపు పలుచగా రాయాలి.దానితో ముఖంపై గుండ్రంగా వలయాకారంలో రుద్దాలి.తరువాత 1 స్పూను తేనెకు 2 స్పూనుల టొమాటో రసం కలిపి ముఖానికి పట్టించాలి.ఒక 15 ని.ల తర్వాత చల్లటి నీళ్ళతో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తుంటే చర్మం నిగారింపుగా ఉండి ముఖం అందంగా ఉంటుంది.దీనితోపాటు పాలకూరతో చేసిన పదార్ధాలు తరచుగా తింటుంటే చర్మం మృదువుగా తయరౌతుంది.  

Wednesday, 26 August 2015

వీలయినప్పుడు.....

                                            మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ముఖం,మేడ,చేతులపై కనిపించని దుమ్ము వల్ల మురికి పేరుకుపోతుంటుంది.అందుకని అప్పుడప్పుడు నాలుగు అంగుళాల కలబంద ముక్క తీసుకుని దానిలోని గుజ్జు, ఒక స్పూను తేనె,2 స్పూనుల  పెరుగు,2 స్పూనుల పళ్ళ రసం(ద్రాక్ష తప్ప) ఏదైనా కలిపి వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా చేసి ముఖానికి,మెడకు,చేతులకు పట్టించి పావుగంట తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో కడిగేయాలి.ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం శుభ్రంగా తయారయి మెరుస్తూ కళకళలాడుతూ ఉంటుంది. 

సరదా ఆట

                                                          కారణాలు ఏవైనా ఒక్కొక్కసారి విపరీతమైన చిరాకు,కోపం,అసహనం,ఏదో  తెలియని ఆందోళన,ఏపనీ చేయలేనీ పరిస్థితి.ఇలాంటి పరిస్థితికి కారణం తీవ్రమైన ఒత్తిడికి గురి కావడమే.ఎదురుగా వచ్చిన వాళ్ళు ఎండిపోతారు అన్నట్లుగా కొంతమంది అనవసరంగా ఎదుటివాళ్ళపై విరుచుకుపడిపోతుంటారు.అది తప్పాఒప్పా అని కూడా ఆలోచించే స్థితిలో ఉండరు.అనవసరంగా అపార్దాలు,అపోహలు. అటువంటి సమయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి.రంగు రంగుల గాలి బుడగలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని నోటితో వాటిలో గాలి నింపాలి.ఇలా చేయడం వల్ల దీర్ఘంగా శ్వాస తీసుకోగలిగి ఒత్తిడి దానంతటదే తగ్గిపోతుంది.వీటిని గాల్లోకి వదిలి పగలగొట్టి సరదాగా చిన్నపిల్లల్లా కాసేపు ఆడుకుంటే మనసుకు సంతోషంగా ఉండడమే కాక మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.

Tuesday, 25 August 2015

నూనె మరకలు పోవాలంటే........

                                                              వంట చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి దుస్తులపై నూనె పడి మరకలు పడుతుంటాయి.అప్పుడు వెంటనే టాల్కం పౌడర్ చల్లి కాసేపు వదిలేయాలి.పౌడర్ లోని  తేమ నూనె మరక పై జిడ్డును పీల్చుకుంటుంది.తరువాత ఉతికితే తేలికగా నూనె మరక పోతుంది. 

Monday, 24 August 2015

అద్భుతమైన ఆహారం

                                         చిలకడ దుంపల్లో  పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.వీటిని తరచు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల చెడ్డ కొలెస్టరాల్ తగ్గుతుంది.రక్తంలో గ్లూకోజు స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.ఇది అందరికీ ఎంతో అద్భుతమైన ఆహారం.వీటికి పలుచగా నెయ్యి రాసి ఆవిరిపై ఉడికించితే ఎంతో రుచిగా ఉంటాయి.వంకాయ,చిలకడ దుంప కలిపి  పులుసు వేస్తే చాలా బాగుంటుంది.

బాదం గింజలు

                                                             బాదం గింజల పైపొట్టు తీయాలంటే వేడినీటిలో ఐదు నుండి పది ని.లు
వేయాలి.తర్వాత ఒలిస్తే పొట్టు తేలికగా వస్తుంది.పొడి చేయాలంటే వాటిని తుడిచి దోరగా వేయించి అప్పుడు పొడి చేయాలి.

కాదేదీ హస్తకళలకనర్హం

                                                           ఎందుకూ పనికిరాదనుకున్న గుర్రపుడెక్కతో రకరకాల హస్తకళాకృతులు 
తయారుచేస్తున్నారని పేపరులో చదివేసరికి చాలా ఆశ్చర్యమనిపించింది.ఎండిన గుర్రపుడెక్క కాడలతో చేసిన అందమైన వస్తువుల ప్రత్యేకత ఏంటంటే 15 ఏళ్ళవరకు చెక్కు చెదరకుండా ఉంటాయని,ఒక్కొక్క తీగ 12 కేజీల బరువు మోయగలదనీ తెలిసి ఇంకా ఆశ్చర్యం వేసింది.ఇవి తయారుచేయటానికి శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన వాళ్ళను,నేర్చుకుని తయారుచేస్తున్న మహిళలను అభినందించవలసిందే.కాదేదీ కథలకనర్హం అన్నట్లు కాదేదీ హస్తకళలకనర్హం అనిపించింది.

ప్రేమే ముఖ్యం

                                                             ఈతరం తల్లిదండ్రులు పిల్లలకు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నామని సంబరపడుతున్నారు.అడుగు నేలమీద పెట్టి నడవకుండా పాఠశాలకు కారులోనే తీసుకెళ్ళి కారులోనే తీసుకొస్తున్నారు.ఏది కావాలంటే అది పిల్లల నోట్లో నుండి మాట బయటకు రాకముందే కష్టమనేది తెలియకుండా ఏది కావాలంటే అది అవసరమున్నా,లేకపోయినా చేతిలో  పెట్టేస్తున్నారు.వాళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నా అన్నింటికన్నా తల్లిదండ్రుల ప్రేమే వాళ్ళకి ఎక్కువ అవసరం  అని గుర్తుపెట్టుకోవాలి.అందరికీ ప్రేమ ఉంటుంది.అతి ప్రేమ అనర్ధదాయకం.అన్నీ అందుబాటులో వుమ్చుతున్నాము కదా!అనుకోకుండా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెట్టాలి.వాళ్ళు ఉత్సాహంగా ఉంటున్నారా?లేదా?అని గమనించాలి.నిరుత్సాహంగా ఉన్నట్లుగా అనిపించితే సమస్య ఏమైనా  ఉందేమో నిదానంగా కనుక్కుని పరిష్కరించాలి.కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు అసలు ఏమి చదువుతున్నారు?స్నేహితులతో ఎలా ఉంటున్నారు?పెద్దవాళ్ళతో ఎలా ఉంటున్నారు?కనీసం తమతో ఎలా ఉంటున్నారని కూడా గమనించటం లేదు.మా పిల్లలు తెలివిగలవాళ్ళు అనే అభిప్రాయం.వాళ్ళ పిల్లలు ఆడింది ఆట పాడింది పాట అనే వ్యవహారంలో ఉంటున్నారు.చివరకు ఏ పదో తరగతి లేక ఇంటరు మార్కులొచ్చినప్పుడో,ఎంసెట్ లో ర్యాంకు రాకపోతేనో తల్లిదండ్రులకు కళ్ళు తెరుచుకుంటున్నాయి.అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అయిపోతుంది.ఈలోపు పిల్లలకు ఎవరన్నా లెక్కలేనితనం అబ్బిపోతుంది.అదీకాక మా అమ్మానాన్నలు సీటు కొంటారులే అనే ధీమా పిల్లలది.ఈపరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా మెలిగి తమతో ఏదైనా చెప్పగలిగేలా ప్రేమగా ఉండాలి. బోలెడంత డబ్బు పెట్టి హాస్టల్లో పెట్టాము వాళ్ళే చూస్తారనుకోకుండా శ్రద్ధ తీసుకోవాలి.

ఆనవాయతీ

                                                                    అనగనగా ఒక ఊరు.ఆ ఊరిలో మంగళ వారం ఎవరైనా చనిపోతే దానికి తోడు తిధి నక్షత్రం బాగోకపోతే అదే రోజు ఇంకో ముగ్గురు చనిపోతారు.ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ మూడనమ్మకాలు ఏమిటి?అనుకోకండి.తిధి,నక్షత్రం బాగానే ఉంటే కర్మ కాండలు అయ్యేలోపు చనిపోతారన్నమాట.లత వాళ్ళ పెద్దమ్మ ఫోనుచేసిమరీ అమ్మాయ్!ఫలానా ఆయన మంగళవారం చనిపోయాడు.అదేరోజు ఇంకో ఇద్దరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే చనిపోయారు.మన ఊరు ఆనవాయితీ కదా!దినం లోపు ఇంకొక అతను అనుకోకుండా చనిపోయాడని చెప్పింది.లత కూడా ఇలాంటివి నమ్మదు కానీ నమ్మక తప్పలేదు.

Sunday, 23 August 2015

ప్రోటీన్లు

                                                                     అరటిపండు,పాలు,గుడ్లు,పెరుగు లాంటి వాటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.వీటిని రోజూ అల్పాహారంలో అందరూ తప్పనిసరిగా తీసుకోవటానికి ప్రయత్నించాలి.వీటిని తీసుకోవటంవల్ల అధిక బరువును అదుపు చేయవచ్చు.ప్రోటీన్లతో కూడిన అల్పాహారం తీసుకున్న వాళ్ళు రోజంతా ఇతర ఆహారాన్ని తగ్గించి తీసుకోగలుగుతారు.అన్ని వయసుల వాళ్ళు ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి.ప్రోటీన్లు అధిక ఆకలిని తగ్గించి శరీరంలో కొవ్వు చేరకుండా నియంత్రిస్తాయి.మాంసాహారులు మాంసం తీసుకోవచ్చు.

గద్ద వచ్చి కోడిపిల్లను..............

                                                                       చిత్ర ఇంటి దగ్గరలో ఏడుఏళ్ల రాహుల్ ఇల్లు ఉంది. .ముద్దుగా బొద్దుగా,తెల్లగా ఉంటాడు.ఆరోజు ఉదయం రోడ్డు మీద ఆడుకుంటుంటే చిత్ర చూసింది.సాయంత్రం కళాశాల నుండి ఇంటికి వచ్చేటప్పటికి రాహుల్ ఇంటి ముందు చాలామంది ఉన్నారు.కొంతమంది కంటతడి పెడుతున్నారు.ఇంటికి వచ్చి అమ్మా!రాహుల్ ఇంటిముందు అంతమంది ఉన్నారు ఏమైంది?అని అడిగింది.రాహుల్ చనిపోయాడు అని చెప్పింది.అదేంటి?ఉదయం బాగానే ఉన్నాడు కదా!అంది చిత్ర.గిన్నెలు తోముకునే ఊక బూడిద తింటున్నాడని వాళ్ళ అమ్మ ఒకదెబ్బ వేసిందట.నోటి నిండా పోసుకున్నాడేమో?కోరింత దగ్గు ఉందట.గుక్క తిప్పుకోలేక అప్పటికప్పుడు గద్ద కోడిపిల్లను తన్నుకెళ్ళినట్లుగా ప్రాణం పోయింది అంది.నింద లేనిదే బొంది పోదు అన్నట్లుగా నువ్వు ఒకదెబ్బ వెయ్యటం వల్లే చనిపోయాడని అందరూ తలా ఒక మాట రాహుల్  అమ్మను తిట్టడం మొదలెట్టారు.పిల్లడు పోయిన బాధలో ఆమె ఉంటే కాకులు పొడిచినట్లు జనం పొడుస్తున్నారు అని చిత్ర అమ్మ చెప్పింది.

Saturday, 22 August 2015

నిద్రలేమి

                                                                        అందరూ హాయిగా నిద్రపోయే సమయంలో నిద్ర పట్టకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది.శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు కొంతమందికి వెంటనే నిద్ర పట్టదు.ఒత్తిడి,ఆందోళన ఎక్కువైనా నిద్రలేమి సమస్య భాధిస్తుంది.కొంతమందికి ఎక్కడెక్కడి ఆలోచనలు ఆసమయంలో గుర్తొచ్చి నిద్రకు దూరం అవుతారు.ముందు కారణం గుర్తించి పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.ఇష్టమైన సంగీతం వినడం,నచ్చిన పుస్తకం చదవుకోవడం చేయవచ్చు.నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చటి కొబ్బరి నూనెను మాడుకు మునివేళ్ళతో సున్నితంగా మర్దన చేయాలి.అలా చేయడం వల్ల హాయిగా ఉండి త్వరగా నిద్ర పడుతుంది,ఇలా తరచు చేస్తుంటే నిద్రలేమి సమస్య నుండి దూరం కావొచ్చు.

గుండెకు మేలు

                                                                                    సొరకాయ లెక ఆనపకాయ రసంలో చిటికెడు ఉప్పు,1/4 లో సగం స్పూను మిరియాలపొడి,కొద్దిగా నిమ్మరసం,కొద్దిగా తేనె కలిపి రోజు తాగితే గుండెకు చాలా మంచిది.

అరటి దూట

                                                                  అరటి దూట అంటే అరటి మొక్క కాండంలో ఉండే లోపలి భాగం. కొంచెం ముక్క తీసుకుని రసం తీయాలి.రుచికి కొంచెం,ఉప్పు,చిటికెడు మిరియాలపొడి,కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి.దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి.దానితోపాటు మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది.దీనితోపాటు రోజుకో కారట్ తింటే మూత్రపిండాలకు ఏసమస్యలు రాకుండా ఉంటాయి.

మిన్నూ- మిన్నీ విదేశీ ప్రయాణం

                                                మిన్నీ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు.అతిగారాబంగా పెంచారు.పై చదువుల కోసం విదేశాలకు వెళ్తానని మొండిపట్టు పట్టింది.తల్లిదండ్రులు సరేననక తప్పలేదు.మిన్నీ తల్లిదండ్రుల దగ్గరలేని సమయంలో తనపై బెంగ పెట్టుకోకుండా ఏం చేయాలి?అని ఆలోచించి ఒక విదేశీ కుక్కపిల్లను కొనుక్కొచ్చింది.దానికి మిన్నూ అని పేరు పెట్టింది.అది చాలా ముద్దుగా ఉండేది.దానికి రకరకాల బట్టలు కొనుక్కొచ్చి వేసేది.కుక్కపిల్లలకు శిక్షణ ఇచ్చే పాఠశాలకు పంపేది.మిన్నూకు అవసరమైనవన్నీఒక సంచిలో పెట్టి వీపుకు తగిలించేది.మిన్నూకు ఒక గది,ఒక మంచం,గది నిండా బొమ్మలు ఏర్పాటు చేసింది.మిన్నూ మంచం పైన తప్ప పడుకోదు.పడుకునేటప్పుడు కూడా దుప్పటి కప్పితేనే పడుకుంటుంది.ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరినీ తన గదిలోకి రానివ్వదు.ఎవరైనా తెలియక పిల్లలు దాని బొమ్మలు పట్టుకున్నారంటే వాళ్ళ పని గోవిందా.ఈలోపు మిన్నూ అల్లరి చేష్టలకు మిన్నీతల్లిదండ్రులు అలవాటు పడ్డారు. ఎంతగా అంటే మిన్నూ శిక్షణ కోసం వెళ్ళి 4 గం.లు పాఠాలు నేర్చుకోవాలి.అన్ని గం.లు మిన్నూను చూడకుండా ఉండలేక ముందే మిన్నీ వాళ్ళ అమ్మ వెళ్ళి మిన్నూని ఇంటికి తెచ్చేస్తుంది.పెంపుడు జంతువులను పెంచుకోవడం వలన వాటి ఆలనపాలనలో ఒత్తిడి నుండి బయటపడవచ్చు.నేను దగ్గర లేకపోయినా వీళ్ళు మిన్నూఅల్లరి చేష్టలతో సంతోషంగా ఉండగలరనే ధైర్యంతో మిన్నీవిదేశీ ప్రయాణానికి సిద్దమైంది.

అంతరాయము కలుగకుండా..........

                                                    మీనాక్షి శ్రావణ శుక్రవారం ప్రశాంతంగా పూజ చేసుకుందామని  ఏ అంతరాయము  కలుగకుండా పనివాళ్ళందరికీ సెలవు ఇచ్చేసింది.కాసేపటికి ఒకసారి ఒక్కొకళ్ళు వచ్చి   అంతరాయం కలిగిస్తుంటారు.పని చేసేది కొంచెం,కబుర్లు ఎక్కువ.అమ్మా!తలనొప్పిగా ఉంది.ఒక్కళ్ళు కూడా సరైన   టీ ఇవ్వలేదమ్మా!కాస్త టీ పెట్టండి అనో,ఆకలేస్తుందమ్మా!అల్పాహారం సమయంలో అల్పాహారం,భోజన సమయంలో భోజనం పెట్టమనటం పరిపాటైపోయింది.ఆకలేసిన వాళ్ళకు  తినటానికి సమయానికి తగినట్లుగా ఏదో ఒకటి పెట్టాలని మీనాక్షి అమ్మమ్మచెప్పటం వలన వాళ్ళు అడగ కుండానే పెట్టే అలవాటు.అయినా అడగకుండా ఉండరు.పోనీ సరిగ్గా ఏమన్నా పని చేస్తారా అంటే అదేమీ లేదు.పైపైన పనులు వాళ్ళు చేసే కన్నా మీనాక్షి చేసే పనే ఎక్కువ.అందుకే మీనాక్షి కనీసం ఒక్క రోజైనా తనకు నచ్చినట్లుగా ఉందామని వాళ్ళందరికీ సెలవు ఇచ్చింది.ఎవరూ వచ్చి తనకు   అంతరాయము కలిగించకుండా ప్రశాంతంగా రోజంతా దైవ ధ్యానంలో మునిగిపోయింది.హమ్మయ్య!ఇన్నాళ్ళకు సంతృప్తిగా పూజ చేసుకోగలిగాను అనుకుంది.

Wednesday, 19 August 2015

స్వచ్చమైన శాకాహారి

                                                                  జానకి ఒక కుక్క పిల్లను తెచ్చి ముద్దుగా డున్నూఅని పేరు   పెట్టింది.జానకి వాళ్ళు శాకాహారులు.డున్నూ చిన్నప్పటి నుండి వీళ్ళఇంట్లో పెరగటంవల్ల అది స్వచ్చమైన శాకాహారిగా తయారైంది.ఒకరోజు జానకి స్నేహితురాలు మాంసాహారం తెచ్చి డున్నూ ముందు పెట్టింది.అప్పుడు డున్నూకు విపరీతమైన కోపమొచ్చి ఆమె మీదపడి కరిచినంత పని చేసింది.ఆమె బతుకుజీవుడా!అనుకుంటూ పరుగెత్తింది.అప్పటినుండి దానికి ఎవరూ మాంసాహారం పెడదామని ప్రయత్నం చేయరు. ఇంకొకసారి జానకి భర్త బయటి నుండి ఆహారపదార్ధాలు తెప్పిస్తే పొరపాటున రెస్టారెంట్ వాళ్ళు మాంసాహార పదార్ధం ఒకటి ఇచ్చారు.వీళ్ళు చూడకముందే డున్నూ వెళ్ళి ఆ కవరు లాగేసి దూరంగా పడేసింది.ఏమిటి?ఇలా ప్రవర్తిస్తుందనుకుని చూస్తే అది మాంసాహారం.జానకికి అసలే చాదస్తం పాళ్ళు ఎక్కువ.ఇది ఈరోజు నన్ను కాపాడింది.లేకపోతే మాంసాహారం ముట్టుకోవాల్సి వచ్చేదనుకుని వాటిని బయట పారేయించి ఇల్లంతా శుద్ధి చేసుకుంది.

మొటిమల మచ్చలు తగ్గాలంటే........

                                                                చిన్న లేత కలబంద ముక్కను తీసుకుని లోపల ఉన్న రసం ఒక ప్లేటులో  వేసి దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి కలిపి దాన్నిముఖానికి రాయాలి.ఒక 20 ని.ల తర్వాత నీళ్ళతో శుభ్రం చేయాలి.రోజుకొకసారి ఇలా చేయగలిగితే మొటిమల తాలుకు మచ్చలు త్వరగా తగ్గటమే కాక ముఖ వర్చస్సు పెరుగుతుంది.  

చురుగ్గా ఉండాలంటే.........

                                                   సెలవు రోజుల్లో వీలయినప్పుడల్లా పిల్లలను పచ్చటి చెట్లమధ్య అంటే ఏ పార్కుకో తీసుకెళ్ళి ఆటలాడిస్తుంటే శారీరకంగా,మానసికంగా చురుగ్గా ఉంటారు.చెట్లు,మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి కనుక సృజనాత్మకంగా అంటే ఏపనయినా అందరికంటే విభిన్నంగా,వినూత్నంగా చేయగలుగుతారు. ఆకుపచ్చ రంగు ఆందోళన తగ్గించి ప్రశాంతంగా ఉంచుతుంది.అందుకే తీరిక సమయం దొరికినప్పుడల్లా పచ్చటి ప్రకృతి మధ్య గడపండి.

Tuesday, 18 August 2015

నడకకు వెళ్ళాలంటే........

                                                 ఉదయం నడకకు వెళ్ళాలంటే స్నేహితులతో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ,హాస్యాన్ని పండిస్తూ,హాయిగా నవ్వుకుంటూ తెల్లవారుఝామున 4 గం.ల నుండి 6 గం.ల లోపు వెళ్ళటం మంచిది.ఎందుకంటే హాయిగా నవ్వటం కూడా ఒక వ్యాయామమే.వాహన కాలుష్యం ఉండదు.ఖాళీ కడుపుతో నడవటం వలన త్వరగా క్యాలరీలు ఖర్చు అవుతాయి.చల్లటి వాతావరణంలో వాహనాల రణగొణ ధ్వనులు లేకుండా ఎంతో  హాయిగా చకచకా నడక తేలికగా సాగుతుంది.స్వచ్చమైన గాలి పీల్చుకోవచ్చు.అప్పుడు మనసులో ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.

సేమ్యా - కారట్ ఇడ్లీ

 సేమ్యా - 1/2 కప్పు
కారట్ తురుము - 1/2 కప్పు
ఇడ్లీ రవ్వ - 1 కప్పు
 ఉల్లిపాయ - 1
పెరుగు - 2 కప్పులు
కొత్తిమీర - 2 స్పూనులు
కరివేపాకు - కొంచెం
 అల్లం - చిన్న ముక్క
నూనె - 1 స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :మినప్పప్పు - 1 స్పూను
ఆవాలు - 1/2 స్పూను
జీర - 1/4 స్పూను నూనె - కొద్దిగా
ఇడ్లీ పిండి :మినప్పప్పు - 1,ఇడ్లీ రవ్వ -2
                                                        ముందు రోజు మనకు కావలసినంత ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకోవాలి.పై కొలతల ప్రకారం ఇడ్లీ రవ్వ,సేమ్యా విడిగా వేయించి ప్రక్కన పెట్టుకోవాలి.బాండీలో కాస్త నూనె పోసి స్టవ్ మీద పెట్టి వేడయ్యాక ఆవాలు,జీర,కరివేపాకువేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు,కారట్ తురుము అల్లం ముక్కలు వేసి వేయించి దించేయాలి.తరువాత ఇడ్లీ పిండిలో పెరుగు,కారట్ మిశ్రమం వేసి బాగా కలపాలి.ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి కానీ,నూనె కానీ రాసి అందులో పిండి పెట్టి ఆవిరి మీద 10 ని.లు ఉడికించాలి.అంతే రుచికరమైన సేమ్యా,కారట్ ఇడ్లీ తయారయినట్లే.మనకు నచ్చిన చట్నీతో తినవచ్చు.

Monday, 17 August 2015

కనీసం పావు గంటైనా.........

                                          రోజూ ఒక్క పావు గంటైనా చర్మానికి ఎండ తగిలేలా నిలబడటం లేదా నడవటం చేయాలి.లేలేత సూర్య కిరణాలు వచ్చేటప్పుడయితే మరీ మంచిది.అంటే ఉదయం 9 గంటలలోపు సాయంత్రం 4 గం.ల నుండి ఎండ తీవ్రత తక్కువగాఉంటుంది.మండుటెండలో అయితే  చర్మానికి హాని జరగవచ్చు.

ఇంట్లో నూనె ఒలికితే.........

                                           మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి హడావిడిలో ఏ చెయ్యో తగిలి నూనె క్రింద 
ఒలికిపోతుంటుంది.అప్పుడు వెంటనే ఒలికిన నూనెపై గోధుమ పిండి కానీ,వరి పిండి కానీ ఏది అందుబాటులో ఉంటే ఆపిండి చల్లితే శుభ్రం చేయడం తేలిక.జిడ్డు త్వరగా వదిలిపోతుంది. 

చమేలి

                                                        చంపావతికి చమేలి పువ్వులంటే చాలా ఇష్టం.అందుకే ఎక్కడెక్కడో వెతికించి
ఆమొక్కను తెప్పించి తనఇంటి పెరట్లో పెట్టించింది.ఊదారంగు,తెలుపు కలగలిసిన మొగ్గలు,మొగ్గ విడలగానే తెల్లగా పువ్వులు సువాసనతో ఎంత బాగుంటాయో!ఆపందిరి దగ్గర కుర్చోవటమంటే అంత ఇష్టం.ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.సాయంత్రం కాగానే కొన్ని మొగ్గలు కోయించి అక్కడక్కడా గిన్నెల్లో కొన్ని మొగ్గలు పెట్టిస్తుంది.రాత్రికి అవి పువ్వులుగా మారి ఇల్లంతా వాటి పరిమళాలు వెదజల్లుతాయి.ఇది ఔషధ మొక్క అని తెలిసిందే కదా! తాజాగా చమేలి పువ్వులతో టీ తాగితే మధుమేహం,అల్సర్లు,ఆందోళన వంటివి తగ్గుతాయని పరిశోధకులు చెప్తున్నారు.ఈ విషయం తెలియకుండానే చంపావతికి చమేలి గ్రీన్ టీ తాగటం అలవాటు. 

Sunday, 16 August 2015

కీమా వడలు

కీమా - 1/4 కేజి(కైమా(మటన్ మెత్తగా కొట్టినది) )
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూను
ఉప్పు - సరిపడా
కారం - 2 స్పూనులు
గరం మసాలా - 1 స్పూను
శనగపప్పు - 1 కప్పు
మెంతికూర - 1 కట్ట
ఉల్లిపాయ - 1
                                                             శనగపప్పుని 2 గంటలు నీళ్ళల్లో నానబెట్టాలి.కీమా,అల్లం,వెల్లుల్లి పేస్ట్,ఉప్పు,కారంవేసి కుక్కర్లో ఉడికించుకోవాలి.నానబెట్టిన శనగపప్పుని బరకగా రుబ్బుకోవాలి.చివరలో ఉడికించిన కీమా వేసి ఒకసారి తిప్పాలి.దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,గరం మసాలా,తరిగిన మెంతు కూర అన్నీ వేసి బాగా కలపాలి.కాగిన నూనెలో ఈ మిశ్రమాన్నివడలుగా వత్తి ఎర్రగా కాలిన తర్వాత తీయాలి.అంతే రుచికరమైన కీమా వడలు తయారైనట్లే.

సగ్గుబియ్యం లడ్డు

సగ్గుబియ్యం - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
నెయ్యి - 1/4 కప్పు
యాలకుల పొడి - 1/4 స్పూను
బాదం,జీడిపప్పు పలుకులు,కిస్ మిస్ అన్నీ కలిపి - 1/4 కప్పు
                                                                  ముందుగా సగ్గుబియ్యం దోరగా వేయించి మెత్తగా పొడిచేసుకోవాలి.పంచదార పొడి చేసుకోవాలి..నెయ్యి వేడిచేసి దానిలో పంచదారపొడి,సగ్గుబియ్యం పొడి,దోరగా వేయించిన బాదం,జీడిపప్పు,పలుకులు,కిస్ మిస్ వేసి అన్నీ బాగా కలపాలి.చేతికి కొంచెం నెయ్యి రాసుకుని పై మిశ్రమాన్నిచిన్నచిన్నలడ్డూలు చేసుకుకోవాలి.అంతే నోరూరించే సగ్గుబియ్యం లడ్డూ తయారైనట్లే.వీటిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకోవాలి.

Saturday, 15 August 2015

గోధుమ రవ్వ దోశ

గోధుమ రవ్వ - 2 కప్పులు
దోశ పిండి - 1 కప్పు
టొమాటోలు -2
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 2
ఉప్పు - సరిపడా
జీరా -1 స్పూను
                                                 గోధుమ రవ్వను శుభ్రంగా కడిగి నీళ్ళల్లో ఒక గంట నానబెట్టాలి.తర్వాత రవ్వలో పచ్చిమిర్చి,టమోటాలు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి.ఈమిశ్రమాన్ని దోశ పిండిలో కలపాలి.ఉల్లిపాయలు సన్నగా తరగి దోశ పిండికి కలపాలి.పెనం పై దోశ వేసి  రెండు వైపులా కాలనివ్వాలి.అంతే రుచికరమైన గోధుమ రవ్వదోశ తినటానికి సిద్దమైనట్లే.కొబ్బరి పచ్చడి దీనిలోకి చాలా బాగుంటుంది.   

నిజమైన శ్రీమంతులు

                                                     ఒకప్పుడు డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళనే శ్రీమంతులు అనేవాళ్ళు.ఎందుకంటే అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవాళ్ళు.ఈరోజుల్లో డబ్బుఉన్నా,లేకున్నా సంపూర్ణ ఆరోగ్యం,మానవత్వం ఉన్నవాళ్ళే నిజమైన శ్రీమంతులు.

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు


                నా బ్లాగు వీక్షకులకు,తోటి బ్లాగర్లకు,భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

                    
 
     

Friday, 14 August 2015

త్వరగా ఉడకాలంటే ..........

                                                 కంద ముక్కలు త్వరగా ఉడకాలంటే  నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే త్వరగా
ఉడుకుతాయి.అలాగే మాంసం ముదురుగా ఉన్నప్పుడు చిన్న బొప్పాయి ముక్క వేస్తే త్వరగా ఉడుకుతుంది.

Thursday, 13 August 2015

పనేంటి?

                                                             శ్రీమంత్ కు కాస్త చాదస్తం పాళ్ళు ఎక్కువ.ఎవరైనా ఫోను చేస్తే నాతో పనేమన్నా ఉందా?అని అడుగుతాడు.స్వంత అన్న,చెల్లెలు ఫోను చేసినా అలాగే అడుగుతుంటే ఎప్పుడైనా ఫోను చేసి కుశల ప్రశ్నలు వేయటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు.ఒకసారి అక్క వరుసయ్యే ఆమెకు ఫోను చేశాడు.అప్పుడు ఆమె వేరేవాళ్ళతో మాట్లాడుతుంది.తర్వాత కాసేపాగి శ్రీమంత్ కు ఫోను చేసింది.కుశల ప్రశ్నలు వేస్తుండగానే ఊతపదం లాగా నాతో పనేంటి?అని అడిగాడు.ఏంటి?ఇలా అడుగుతున్నాడు అనుకుని నాకు నీతో పనేముంటుంది శ్రీమంత్. నువ్వే నాకు ఫోను చేశావు కదా!నీ ఫోను నంబరు చూసి ఇప్పుడు చేశాను అనేసరికి మ్రాన్పడి ఆ,ఆ ఇందాకెప్పుడో అమ్మ మాట్లాడతానంటే  చేశాను అనేశాడు.ఊతపదాలు మనకు,ఎదుటివాళ్లకు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి.  

ముఖం మృదువుగా ఉండాలంటే..........

                                                     చిటికెడు పసుపు,1 స్పూను తేనె,2 స్పూనుల శనగ పిండి,సరిపడా పాలు కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా తరచుగా చేస్తుంటే ముఖం మృదువుగా,మెరుస్తూ ఉంటుంది.దీన్నే మెడకు చేతులకు కూడా పట్టించి గోరు వెచ్చటి నీటితో కడగాలి.చర్మం మృదువుగా తయారై కాంతివంతంగా ఉంటుంది. 

Wednesday, 12 August 2015

నేర్చుకోవటానికి వెళ్తున్నా

                                                              నాగవల్లికి ఆరు పదుల వయస్సు.అక్కతో మాట్లాడి చాలా రోజులైందని చెల్లెలు ఫోను చేసి ఏమి చేస్తున్నావు?అంటే క్లాసులకు వెళ్తున్నాను అని చెప్పింది.చుట్టుప్రక్కల కొంతమంది కలిసి గీతాపారాయణం నేర్చుకోవటానికి లక్ష్మీపాప దగ్గరకు వెళ్తున్నాము అని చెప్పింది.ఆవిడకు డెబ్భై సంవత్సరాలు.కానీ గొంతు శ్రావ్యంగా,వినసొంపుగా ఉంటుంది.ఆవిడ శ్లోకం చెప్పి,అర్ధం,పరమార్ధం విడమరచి చెప్తుంటే అమృతం కన్నా మధురంగా ఉందని నాగవల్లి చెప్పింది.ఈవయసులో మూడుగంటలు క్రింద కూర్చుని నేర్చుకుందామని వెళ్ళటానికి    ఆవిడ ఓపికగా నేర్పించడానికి సరిపోయింది.మాములుగా డబ్బులిస్తే తీసుకోదు కనుక,ఎవరి సహాయము పొందటం ఇష్టం ఉండదు కనుక గురుదక్షిణగా తలా కొన్ని వేలు వేసుకుని మాతృప్తి కోసం తీసుకోమని ఇవ్వాలి అని చెప్పింది.

నాణానికి మరో వైపు

                                                                           లక్ష్య ఉన్నత విద్య అభ్యసించడానికి వేరే దేశంలో ఉన్న ప్రముఖ విశ్వ విద్యాలయంలో చోటు సంపాదించింది.అక్కడ కొంత మంది స్వదేశీయులు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు పరిచయం అయ్యారు.మాటల సందర్బంగా స్వదేశంలో అమ్మాయిల చదువు,ఇతర సామాజిక పరిస్థితుల గురించి చర్చ మొదలైంది.ఎవరికి వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్పటం మొదలు పెట్టారు.లక్ష్య తన రాష్ట్రంలోఎక్కడో  కొద్దిమంది తప్ప దాదాపు అందరూ డబ్బు ఉన్నా,లేకపోయినా,మధ్యతరగతి వాళ్ళైనా అమ్మాయి పుట్టగానే లక్ష్మీదేవి పుట్టిందని సంతోషంగా సంబరాలు చేసుకుంటారని,ఏలోటు రాకుండా పెంచి,చదువు చెప్పించి,తగిన వరుడ్నిచూచి పెళ్లి చేస్తారని చెప్పింది.ఆడపిల్లని కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పింది.లక్ష్యా!నీకు నాణానికి ఒక వైపు మాత్రమే తెలుసు.నాణానికి మరో వైపు ఎంత దారుణంగా ఉంటుందంటే మావైపు కొన్ని రాష్ట్రాలలో ఆడపిల్లని కడుపులో ఉండగానే చంపేస్తారు.ఒకవేళ పుట్టినా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది.అందుకనే ఆడపిల్లలు కరువై ఆడపిల్లల్నివేరే చోట నుండి ఎదురు డబ్బిచ్చి ఒకడు పెళ్ళి చేసుకొచ్చి ఇంట్లో ఉన్నమగ వాళ్లందరికీ భార్యగా ఉండమని లేకపోతే హింసిస్తుంటారు.తల్లిదండ్రుల వద్దకు వెళ్ళలేని పరిస్థితి.అక్కడ ఉండలేని దారుణమైన పరిస్థితి.కడుపున పుట్టిన  బిడ్డ ఎవరి బిడ్డో తెలియని పరిస్థితి.కష్టాలు భరించలేక చనిపోదామన్నాఎవరోఒకళ్ళు  కుక్క కాపలా.ఏమిటీ?స్త్రీని పవిత్రంగా చూస్తారనుకునే మన దేశంలో,21వ శతాబ్దంలో కూడా ఇంత దారుణమైన,హేయమైన పరిస్థితులున్నాయా?అని వింటున్నలక్ష్య ఆశ్చర్యపోయింది.ఇవి మచ్చుకి మాత్రమే అని చెప్పారు.                    

Tuesday, 11 August 2015

ఒక్కొక్కసారి.........

                                     ఒక్కొక్కసారి సమయానికి కరివేపాకు,కొత్తిమీర,పుదీనా,మెంతు కూర వంటివి ఇంట్లో తాజాగా ఉండకపోవచ్చు.ఇంటి నుండి బయటకు వెళ్ళి తెచ్చుకునేంత సమయం లేకపోవచ్చు.ఒక్కొక్కకాలంలో తాజాగా కూడా ఇవి దొరకవు.అందుకని ఇవి బాగా తాజాగా దొరికే సమయంలో ఎక్కువ తెచ్చుకుని వాటిని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టి బాగా గలగలలాడుతూ ఎండిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే సంవత్సరమంతా తాజాగా ఉంటాయి.అవసరమైనప్పుడు తాలింపు వేసి పొయ్యి కట్టేసిన తర్వాత ఏ పొడి వెయ్యాలంటే అది చిటికెడు వేస్తే ఆ వేడికి వేగినట్లయి మాడిపోకుండా అప్పటికప్పుడు తాజా ఆకు వేసినంత మంచి వాసనతో బాగుంటుంది.

Monday, 10 August 2015

చర్మం బిగుతుగా మారాలంటే...........

                                                                     ఒక గిన్నెలో రెండు స్పూనుల పెరుగు తీసుకుని దానిలో 4,5 చుక్కలు నిమ్మరసం కలిపి ఒక పది నిముషాలు ముఖానికి,మెడకు క్రింది నుండి పైకి చర్మం లోపలికి ఇంకేలా రాయాలి.ఒక 5 ని.లు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి.ఇలా వారానికి ,మూడు సార్లు చేయాలి.అప్పుడు సాగిన ముఖం,మెడ చర్మం బిగుతుగా మారుతుంది. 

Saturday, 8 August 2015

నైజం

                                                                       మోహన్ పెద్ద జిత్తులమారి.అమ్మా!నిన్ను నేను పువ్వుల్లో పెట్టి చూస్తాను నాదగ్గరే ఉండు అని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళి ఆమె దగ్గర ఆస్తి మొత్తం తన పేరు మీద వ్రాయించుకున్నాడు.కొన్నాళ్ళు బాగానే ఉన్నాడు.వాళ్ళు పెళ్లిళ్లకు వెళ్తూ అమ్మను వెంటబెట్టుకుని వెళ్ళకుండా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఇంటికి కాపలా మనిషిని చేశాడు.ఇంట్లోపని మొత్తం అమ్మే చేస్తుంది.అమ్మకు ఎప్పటినుండో నడుము నొప్పిగా ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఏదోఒకటి తాత్కాలికంగా మందు తీసుకొచ్చి ఇస్తున్నాడు.మరీ నొప్పి ఎక్కువయ్యేసరికి వైద్యుని దగ్గరకు తీసుకెళ్తే నడుముకు ఆపరేషన్ చెయ్యాలన్నారు.అమ్మ దగ్గర మొత్తం డబ్బు తీసేసుకున్నాడు కనుక తన చేతి డబ్బు ఖర్చు అవుతుందని అమ్మకు ఆపరేషన్ అంటే భయం.అందుకని ఏమి చెయ్యాలా?అని ఆలోచిస్తున్నాను అని అందరికీ చెపుతున్నాడు.చివరకు ఆపరేషన్ చెయ్యనక్కరలేదు. మందులు వాడుకుంటే సరిపోతుందన్నారు అని చెప్పాడు.పాపం అమ్మ నిజమే అని నమ్మింది.అబద్దాన్ని కూడా నిజమని నమ్మించడం మోహన్ నైజం.మోహన్ కు అది వెన్నతో పెట్టిన విద్య.పుట్టిన బిడ్డల్లో అందరికన్నా ఇష్టమైన మోహన్ అబద్దం చెప్పినా నిజమేనని నమ్మటం మోహన్  అమ్మ నైజం.  

ఎప్పుడంటే అప్పుడు.......

                                                            ఖాళీ సమయంలో కారట్ తురిమి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఒక వారం రోజులు తాజాగా ఉంటుంది.ఒక్కొక్కటి తురుముకోవలసిన అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.వేపుళ్ళలో వేసినప్పుడు కారట్ వేగీ వేగకుండా తీసేయాలి.దేనిలో వేసినా బాగుంటుంది.దీనికి తోడు పచ్చి బఠాణీ,ఉల్లి కాడలు ఫ్రిజ్ లో అట్టిపెట్టుకుంటే పిల్లలకు రకరకాల వంటలు అప్పటికప్పుడు చేసిపెట్టవచ్చు.రంగు రంగులతో ఉంటే పిల్లలకు చూడటానికి కంటికి ఇంపుగా ఉండటమేకాక అన్నీ వెయ్యటంవల్ల నోటికి రుచిగా ఉండి తినటానికి ఇష్టపడతారు.పెద్దవాళ్ళు కూడా అన్ని రకాల కూరగాయలు తినడం  ఎంతో మంచిది. 

Friday, 7 August 2015

కీళ్ళనొప్పులకు పసుపు

                                                                 పసుపు జలుబు తగ్గించటంతో పాటు కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది.రోజూ ఒక 1/4 టీ స్పూను పసుపు ఏదో ఒక రూపంలో తీసుకుంటే క్రమంగా కీళ్ళకు సంబంధించిన నొప్పులు తగ్గుతాయి.పసుపు కాన్సర్ నివారిణి.

Thursday, 6 August 2015

నల్ల చీర

                                                         మాలతి ముచ్చటపడి చీరలపై పెయింట్ వేయడం నేర్చుకుంది.తనకు నలుపు అంటే అమితమైన ఇష్టం.ఎంతో ముచ్చటపడి నల్లచీర కొని దానిపై  తనకు నచ్చిన డిజైన్,నచ్చిన రంగులతో తీర్చిదిద్దింది.ఇంతలో అమెరికా నుండి మరదలు వచ్చింది.గొప్పగా తను పెయింటింగ్ వేశానని నల్ల చీర పెట్టవచ్చో లేదో అనే ఆలోచన లేకుండా ఎంతో ప్రేమతో మరదలికి బొట్టుపెట్టి నల్ల చీర ఇచ్చింది.బొట్టు పెట్టి నల్లచీర ఎవరికీ పెట్టగూడదన్న విషయం తెలిసినా పట్టించుకోకుండా తనైతే తీసుకోదు కానీ ఎదుటివాళ్ళ దగ్గర అవేమీ ఆలోచించదు.ఇది జరిగి మూడేళ్ళు అయింది.మాలతీ నాన్నను కొడుకు,కోడలు కొద్దిరోజులు వాళ్ళింటికి తీసుకెళ్ళారు.అప్పుడు ఏదో మాటమీద నల్లచీర విషయం వచ్చింది.మీ కూతురుకు నల్లచీర పెట్టకూడదు అని తెలియదా?ఏమీ అనలేక ఇష్టం లేకపోయినా తీసుకున్నాను అంది.తనకు తెలియదేమో అంటే పెళ్లీడు కొచ్చిన ఇద్దరు పిల్లలు ఉండగా ఆమాత్రం తెలియదా?చిన్నదాన్ని నాకే తెలియగా లేనిది అని మామను తెగ సతాయించింది.మామకు విసుగు వచ్చిఆ చీర ఇవ్వు నాకూతురుకే ఇచ్చేస్తాను అని తెచ్చి కూతురికి ఇచ్చాడు.ఇక మీదట నల్లచీర ఎవరికీ పెట్టకు తల్లీ!అని చెప్పాడు.

చేతులు కోమలంగా ఉండాలంటే........

                                                                      వారానికి రెండుసార్లు ఆలివ్ నూనె చేతులకు రాసుకుని ఒక 1/4 గంట తర్వాత సబ్బుతో కాకుండా శనగపిండితో కడిగేయాలి.దానితోపాటు రోజుకొకసారి ఒక అరచేతిలో ఇంకొక చేయి వెనుకవైపు పెట్టి ఒక 5 ని.లు రుద్దాలి.రెండు చేతులు అలాగే చేయాలి.అప్పుడు చేతులకు రక్తప్రసరణ బాగా జరిగి చేతులు కోమలంగా తయారవుతాయి.

జంతు ప్రవర్తన

                                                                             ఓషియో విదేశాలకు ఉన్నతవిద్య కోసం వెళ్ళాడు.అక్కడ విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత మొదట్లో  తరగతులకు హాజరైనప్పుడు అక్కడి బోధనా విధానానికి అలవాటు పడక విసుగు అనిపించేది.అప్పుడు ఏమి చెయ్యాలో తెలియక తన చేతికున్న పెద్దపెద్ద గోళ్ళను నోటితో కొరికి చుట్టూ పడేశాడు.తర్వాత మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు.అక్కడ పరిసరాలు,తరగతి గదులు శుభ్రంగా ఉంటాయి కనుక ఆ స్థలంలో కూర్చుని ఈపని చేసింది ఎవరు?అని అడిగారు.చిన్నపిల్లలు కాదు కదా!కల్లా కపటం లేకుండా నిజం చెప్పెయ్యడానికి అందుకని ఆ స్థలంలో ఫలానా వాళ్ళు కూర్చున్నారు అని తెలిసినా ఎవరూ నోరు విప్పలేదు. జంతువుల్లాగా గోళ్ళు పెంచుకుని,నోటితో కొరకటం,చుట్టుప్రక్కల పడేయటం ఈపిచ్చి పనులు జంతు ప్రవర్తనను తలపిస్తున్నాయి.ఎంత వయసు వచ్చినా సభ్యత లేకపోతే ఎలా?అని అందరినీ చివాట్లు పెట్టారు.నీకసలు బుద్దుందా?గోళ్ళు పెంచడం ఒక తప్పు,కొరకటం ఇంకో తప్పు,చుట్టూ పడేయటం ఇంకో తప్పు.ఇన్ని తప్పులు చేసినప్పుడు తిట్టక ఏమి చేస్తారు?నీ పేరు చెప్పక పోవటంవల్ల మేమందరమూ తిట్లు తినాల్సి వచ్చింది అని తల ఒక పక్కా మీద పడికొట్టినంత పని చేశారు.ఇంత జరిగినా ఓషియో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు.

Wednesday, 5 August 2015

బుర్రలో తెలివి లేదు

                                                                          ఒక పెద్దావిడ చిత్రలేఖనం ఉపాధ్యాయురాలిగా పనిచేసేది.కొన్ని బాధ్యతల కారణంగా కొద్ది రోజులు ఉద్యోగం మానేసింది.తర్వాత తిరిగి కొత్త ఉద్యోగంలో చేరదామని చిత్రలేఖనంలో నూతన మార్పులను తెలుసుకుందామని  చిత్రలేఖనం నేర్పించే ఒక కోచింగ్ సెంటర్ లో చేరింది.అక్కడ నేర్పించే ఆయన కాస్త తిక్క మనిషి.తన మూడ్ ని బట్టి పాఠాలు చెప్పటమో,సొల్లు కబుర్లు చెప్పటమో,అకారణంగా తిట్టటమో చేసేవాడు.ఏవయసు వాళ్ళకయినా నేర్పిస్తానన్నాడు కనుక అందరూ దాదాపు పెద్దవాళ్ళే వచ్చేవారు.వాళ్ళను ఏది బడితే అది మాట్లాడేవాడు.ఒకరోజు పుసిక్కిన ఉత్తపుణ్యానికి పెద్దావిడని నీ బుర్రలో అసలు తెలివి లేదు అనేశాడు. ఇంత బతుకూ బతికి ఎదురు డబ్బుఇచ్చి మరీ వీడితో ఏది పడితే అది అనిపించుకోవాల్సి వస్తుందని పెద్దావిడ తెగ బాధ పడుతుంది.అలా ఏది పడితే అది అంటే కోపమొచ్చి మానేస్తారని మళ్ళీ కొత్తవాళ్ళను చేర్చుకుని డబ్బు తీసుకోవచ్చని ప్రణాళిక అన్నమాట.ఆ విధంగా డబ్బు దండుకునే కార్యక్రమానికి తగినట్లుగానే అతని మాట తీరు నచ్చక చాలామంది పూర్తిగా నేర్చుకోకుండానే మధ్యలో మానేస్తుంటారు.నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళందరూ పూర్తిగా నేర్చుకుని సంతోషంగా పదిమందితో వెళ్ళి చెబితే ఎంత బాగుంటుంది?తిట్టుకుంటూ డబ్బు దండుకోవటం తప్పఅక్కడ  మరేమీ లేదు.అక్కడ చేరటం శుద్ధ దండగ అని చెప్తే ఎంత బాగుంటుంది?డబ్బు సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు కదా!పేరు ప్రఖ్యాతలు కూడా ముఖ్యమే కదా!అదేమంటే మేము బ్రతకాలి కదా!అంటాడు.

ఇంటి యజమానిని పిలువు

                                                              మంజరి,శివరామ్ భార్యాభర్తలు.ఇద్దరూ వృత్తిరీత్యా వైద్యులు.విదేశాలలో స్థిరపడ్డారు.ఇద్దరికీ తోటపని అంటే చాలా ఇష్టం.ఒక పదిఎకరాల పొలంకొని అందమైన ఇల్లు కట్టుకుని దానిచుట్టూ రకరకాల అరుదైన మొక్కలతో తోటను ఏర్పాటు చేసుకున్నారు.స్వతహాగా శివరామ్ కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం.ట్రాక్టరు,భూమిని   దున్నే యంత్రాలతో సహా అన్ని పనిముట్లు కొని దానికొక షెడ్డు వేసి ప్రత్యేకంగా అందులో పెడతారు.సాయంత్రం ఇంటికి రాగానే ఇద్దరూ స్వయంగా తోటపనికి అవసరమైన సామాన్లు తీసుకుని తోటపని మొదలుపెడతారు.వీళ్ళు ఇల్లు కట్టుకున్నప్పట్లో అక్కడ ఎక్కువ ఇళ్ళు ఉండేవి కాదు.నాలుగురోడ్ల కూడలికి దగ్గర  కనుక వచ్చేపోయే వాళ్ళకు ఇల్లు కనిపించేది.కొంతమంది ఆగి మరీ చూచి వెళ్ళేవాళ్ళు.ఒకసారి ఒక కుటుంబం వచ్చి తోటలో పని చేసుకుంటున్నశివరామ్ ని పిలిచి ఇంటి యజమానిని పిలువు అన్నారు.అంతకు ముందే వర్షం పడటంతో శివరామ్ చేతులకు,బట్టల నిండా అక్కడక్కడా మట్టి అంటింది.నేనే ఇంటి యజమానిని అని వాళ్ళతో చెప్పేసరికి చాలా ఆశ్చర్యపోయారు.మీఇల్లు.తోట చాలా బాగున్నాయి.ఒకసారి మీతోట మొత్తం చూద్దామని వచ్చామన్నారు.సరే,చూడండి అని మొత్తం తిప్పి చూపించాడు.రకరకాల రంగుల పువ్వులతో ,ఒకటి ఉండి ఇంకొకటి లేదు అనుకోకుండా అన్ని రకాల పండ్ల మొక్కలు,కూరగాయల మొక్కలు,క్రోటన్స్ అందంగా కత్తిరించి చూడటానికి తోట ఎంతో అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

Tuesday, 4 August 2015

గుప్పెడు ద్రాక్ష

                                                       రోజూ ఒక గుప్పెడు ద్రాక్ష పండ్లు తింటే నడుము నొప్పితో ఇబ్బంది పడేవారికి
నొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.

చాక్లెట్లు తిన్నంత తేలికగా .........

                                                       హిమజ ఏచిన్న నొప్పి అనిపించినా చాక్లెట్లు తిన్నట్లు మందులు వేసుకుంటుంది.హమ్మయ్య!మందు వేసుకున్నాను కనుక నొప్పి తగ్గిపోయిందని సంతోషపడిపోతుంది.హిమజ అక్క కూతురు వైద్యురాలు.ఒకసారి హిమజ ఇంటికి వచ్చింది.అందరూ కలిసి బట్టలు,అవసరమైన వస్తువులు కొనుక్కుని ఇంటికి వచ్చారు.రాగానే తలనొప్పి వచ్చిందని ఒక మందు,కాళ్ళు నొప్పులు అని ఒక మందు వేసుకుంది.అదేమిటి పిన్నీ?చాక్లెట్లు తిన్నంత తేలికగా మందులు వేసుకున్నావు అని అడిగింది.నేనెప్పుడూ అంతే అలాగే వేసుకుంటాను అంది హిమజ.అలా చిన్నచిన్న నొప్పులకే మందులు వేసుకోకూడదు.దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి.అసలు అవసరమైనప్పుడు మందులు పనిచెయ్యని పరిస్థితి వస్తుంది.వాటి ప్రభావం మిగతా అవయవాలమీద మరీ ముఖ్యంగా పెద్దప్రేగుల మీద ఎక్కువగా పడుతుంది.కనుక మరీ భరించలేనంత నొప్పి వస్తే తప్ప చిన్నచిన్న వాటికి వేసుకోకూడదు అని చెప్పింది.వైద్యుల సలహా లేనిదే ఏది పడితే అది ముఖ్యంగా నొప్పి మందులు అసలు వాడకూడదు అంది.నొప్పి తగ్గితే చాల్లే అనుకున్నాను.వాటివల్ల దుష్ఫలితాలు ఉంటాయని తెలుసు కానీ ఇంత తీవ్రంగా ఉంటాయని అనుకోలేదు.ఇక ముందు వేసుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అంది హిమజ.

Monday, 3 August 2015

దీపం చుట్టూ తిరిగే శలభం

                                                              వసుమతికి ఆమె కూతురు రోజుకొకసారి తప్పనిసరిగా వీలైనప్పుడు ఏదో ఒక సమయంలో ఫోను చేసి అమ్మను కుశల ప్రశ్నలు వేసి ఆతర్వాత కాసేపు పిల్లల ముచ్చట్లు,ఇంకొంచెంసేపు మామూలు కబుర్లు చెప్పటం అలవాటు.ఈలోపు వసుమతి కోడలు వీళ్ళిద్దరూ ఏమి మాట్లాడుకుంటున్నారో అని ఉత్సుకతతో వసుసుమతి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆమె చుట్టూ ఏదో ఒక పని ఉన్నట్లు దీపం చుట్టూ తిరిగే శలభం మాదిరిగా గిరగిరా తిరుగుతుంటుంది.వసుమతికి అది నచ్చదు.అందుకని సరేనమ్మా! ఉంటాను అంటూ ఉంటుంది.అప్పుడు కూతురు అర్ధం చేసుకుని సరే అంటుంది.అమ్మాకూతుళ్ళు మాట్లాడుకునే సమయంలో కోడలు ఇంట్లో లేకపోతే అమ్మ తిరిగినట్లు శలభంలా వసుమతి చిన్న మనుమరాలు పదిహేనేళ్ళది నానమ్మ చుట్టూ చక్కర్లు   కొడుతుంది.అక్కడ రహస్యాలు ఏమీ ఉండవు అయినా ఎదుటివాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో వినడం ఒక చెడ్డ అలవాటు.తల్లికి బుద్ధి లేకపోయే పిల్లకు కూడా అదే అలవాటు నేర్పుతుంది. 

తొమ్మిది ఏళ్ళ తర్వాత........

                                                          శ్రావ్య కుటుంబ సభ్యులందరికీ ప్రకృతి సిద్ధంగా వచ్చిన పుట్టగొడుగులు అంటే చాలా ఇష్టం.వర్షాలు పడటం మొదలైన దగ్గర నుండి రెండు నెలలవరకు విరివిగా దొరుకుతాయి.ఒకవేళ వాళ్ళ ఊరిలో దొరకకపోయినా వేరే ఊరి నుండి తెప్పించి మరీ తినేవాళ్ళు.అలాంటిది ఉద్యోగరీత్యా వేరే నగరానికి వెళ్ళటంతో  అక్కడ కృత్రిమంగా పండించినవి తప్ప దొరికేవికాదు.వాటి రుచి  వీళ్ళకు నచ్చక తినేవాళ్ళు కాదు.అలా తొమ్మిది ఏళ్ళు గడిచిన తర్వాత స్వంత ఊరికి రావటంతో మళ్ళీ పుట్టగొడుగులు కనిపించడంతో ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాకపోతే బరువు తగ్గే కార్యక్రమంలో భాగంగా చిక్కి శల్యమైనట్లు అంతకుముందు కట్టలో  1/4 భాగమే రెట్టింపు ధరకు కొనుగోలు చేయవలసి వచ్చింది.అయినా తొమ్మిది ఏళ్ళతర్వాత పుట్టగొడుగులు దొరకటమే మహద్భాగ్యంగా భావించి వాటిని కొనుగోలు చేసి ఎంతో ఇష్టంగా తృప్తిగా తిన్నారు. 

వెన్నెముక లేని వెధవ

                                                         హరనాధరావు కష్టపడి కొడుకుని వైద్యవిద్య చదివించి దూరపు బంధువుల అమ్మాయినిచ్చి పెళ్ళి చేశాడు.పెళ్ళయిన దగ్గర నుండి పిల్లాడిని అత్తింటి వారి చేతుల్లో పెట్టినట్లయింది.హరనాధరావు కొడుకు వేరే దేశంలో స్థిరపడ్డాడు.అత్తను,మామను రెండుసార్లు తీసుకెళ్ళాడు కానీ తండ్రిని తన ఇంటికి రమ్మనలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాగైతే తండ్రిని ఒక నెలరోజులు తన ఇంటికి తీసుకెళ్ళాడు.ఆ నెలరోజుల్లో ఆయనకు కొడుకు సంగతి పూర్తిగా అర్ధమై కూతురుతో అమ్మా!నీ తమ్ముడు ఇప్పుడు వెన్నెముక లేని వెధవ అయిపోయాడమ్మా!ఇప్పుడు వాడి వెన్నెముక వాడి భార్యే!అన్నాడు.చూచాయగా అర్ధమైనా ఆయన నోటితోనే విందామని అంటే నాకు పూర్తిగా అర్ధం కాలేదు వివరంగా చెప్పమంది.దీనిలో అర్ధం కాకపోవటానికి ఏముంది?భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు సంప్రదించుకుని ఏపనైనా చేసుకుంటే ఎవరికీ సమస్య ఉండదు.మంచయినా,చెడ్డయినా గుడ్డిగా భార్య చెప్పినదే వేదం అన్నట్లుంది అక్కడి వ్యవహారం అందుకే అలా అన్నాను అని చెప్పాడు.  

Sunday, 2 August 2015

తలంతా దురదగా ఉంటే......

                                                         ఒక్కొక్కసారి తలలో చుండ్రు లేకపోయినా తలంతా దురదగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది.అలాంటప్పుడు ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకుని తలంతా పట్టించాలి.ఒక అరగంట తర్వాత షాంపూతో కానీ,కుంకుడు కాయల్లో మందార ఆకులు తుంచి వేసి ఆ రసంతో కానీ తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా ఉంటుంది.

Saturday, 1 August 2015

జుట్టు రాలకుండా ఉండాలంటే........

                                                       ఆడవాళ్ళకు జుట్టు ఒత్తుగా,నల్లగా,నిగనిగలాడుతుంటే ,ముఖం అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.అందుకే మనం జుట్టు రాలకుండా ఆరోగ్యంగా అందంగా  ఉండేలా కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలి.వారానికి ఒకసారి మూడు స్పూనుల గోరింటాకు పొడి,మూడు స్పూనుల కరివేపాకు పొడి,ఒక స్పూను మందారఆకుల పొడి,సరిపడా పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో,గోరువెచ్చటి నీటితో తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గి ఒత్తుగా నల్లగా వస్తుంది.   

రాతి గుండె కరిగింది

                                                                         మధుమతి గుండె బండరాయి కన్నా కఠినమైనది.మధుమతికి
పదిహేనేళ్ళ వయసులో అమ్మతో కలిసి అమ్మమ్మ ఊరునుండి వస్తుండగా ఒక విచిత్రం జరిగింది.ఎందుకో అమ్మ మనసు బాధపడి చెల్లి,నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.నేను చనిపోతున్నాను అనిచెప్పి చూస్తుండగానే నదిలో దూకేసింది.అయ్యో!అమ్మను ఆపగలిగితే బ్రతికేది కదా!అన్న బాధ కించిత్తు కూడా లేదు.ఎప్పుడూ చదువుకో అంటుందని అమ్మ మీద కోపం అందుకే పోతేపోయిందిలే అనుకున్నానంటుంది.కాలక్రమంలో ఎలాగో పెళ్ళయినా మార్పులేదు.చరిత్ర పునరావృతమైనట్లు పదిహేనేళ్ళ కూతురు చదువుకోమంటే చస్తానంటుంది.నువ్వు చచ్చినా బతికినా నాకనవసరం నేను చెప్పిందే వేదం అంటుంది మధుమతి.ఈరెండు మచ్చుతునకలు మాత్రమే.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇంతటి రాతిగుండెను అబ్దుల్ కలామ్ గారి మరణం కదిల్చింది.ఆయన మరణవార్త తెలియగానే మధుమతి వెక్కివెక్కి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు?అంటే నాకు  అబ్దుల్ కలాం అంటే చాలా ఇష్టం అందుకే ఏడుపొచ్చింది అంటూ రెండు  రోజులవరకూ గుర్తొచ్చినప్పుడల్లా కన్నీరు పెడుతూనే ఉంది.ఓర్నీ!కలాం మరణం రాతిగుండెను కూడా కరిగించినదన్న మాట.కలాం జీ సదా చిరస్మరణీయుడే అయినా ఇది విచిత్రం.