ఈతరం తల్లిదండ్రులు పిల్లలకు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నామని సంబరపడుతున్నారు.అడుగు నేలమీద పెట్టి నడవకుండా పాఠశాలకు కారులోనే తీసుకెళ్ళి కారులోనే తీసుకొస్తున్నారు.ఏది కావాలంటే అది పిల్లల నోట్లో నుండి మాట బయటకు రాకముందే కష్టమనేది తెలియకుండా ఏది కావాలంటే అది అవసరమున్నా,లేకపోయినా చేతిలో పెట్టేస్తున్నారు.వాళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నా అన్నింటికన్నా తల్లిదండ్రుల ప్రేమే వాళ్ళకి ఎక్కువ అవసరం అని గుర్తుపెట్టుకోవాలి.అందరికీ ప్రేమ ఉంటుంది.అతి ప్రేమ అనర్ధదాయకం.అన్నీ అందుబాటులో వుమ్చుతున్నాము కదా!అనుకోకుండా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెట్టాలి.వాళ్ళు ఉత్సాహంగా ఉంటున్నారా?లేదా?అని గమనించాలి.నిరుత్సాహంగా ఉన్నట్లుగా అనిపించితే సమస్య ఏమైనా ఉందేమో నిదానంగా కనుక్కుని పరిష్కరించాలి.కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు అసలు ఏమి చదువుతున్నారు?స్నేహితులతో ఎలా ఉంటున్నారు?పెద్దవాళ్ళతో ఎలా ఉంటున్నారు?కనీసం తమతో ఎలా ఉంటున్నారని కూడా గమనించటం లేదు.మా పిల్లలు తెలివిగలవాళ్ళు అనే అభిప్రాయం.వాళ్ళ పిల్లలు ఆడింది ఆట పాడింది పాట అనే వ్యవహారంలో ఉంటున్నారు.చివరకు ఏ పదో తరగతి లేక ఇంటరు మార్కులొచ్చినప్పుడో,ఎంసెట్ లో ర్యాంకు రాకపోతేనో తల్లిదండ్రులకు కళ్ళు తెరుచుకుంటున్నాయి.అప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం అయిపోతుంది.ఈలోపు పిల్లలకు ఎవరన్నా లెక్కలేనితనం అబ్బిపోతుంది.అదీకాక మా అమ్మానాన్నలు సీటు కొంటారులే అనే ధీమా పిల్లలది.ఈపరిస్థితి రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా మెలిగి తమతో ఏదైనా చెప్పగలిగేలా ప్రేమగా ఉండాలి. బోలెడంత డబ్బు పెట్టి హాస్టల్లో పెట్టాము వాళ్ళే చూస్తారనుకోకుండా శ్రద్ధ తీసుకోవాలి.
No comments:
Post a Comment