చిన్నూ, బన్నూ చిన్నప్పటి నుండి అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేవారు.చిన్నూ ఏపని చేస్తే బన్నూ ఆపని చేసేవాడు.చిన్నూ పై చదువులకు విదేశాలకు వెళ్ళాడు.బన్నూ కూడా ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతూ విదేశాలకు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు.అందులో భాగంగా ఒక పేపరు తెచ్చుకోవాలని హడావిడిగా వెళ్తూ శిరస్త్రాణం మర్చిపోయాడు.దారిలో ఒక పెద్దాయన రోడ్డు దాటుతూ ఇటు వస్తే ఇటు
అటు వెళ్తే అటు అడ్డుపడేసరికి పెద్దాయనను తప్పించబోయి డివైడర్ కు తగిలి క్రిందపడి పోయాడు.అప్పటికప్పుడు
తల పగిలి రక్తపు మడుగులోనే వెంటనే కోమాలోకి వెళ్ళి నిమిషాలలో ప్రాణం పోయింది.కన్ను మూసి కన్ను తెరిచేంతలో కళ్ళెదుట జరిగిన సంఘటన చూచి ఎవరి బిడ్డో పెద్దాయనను తప్పించడం మంచిపనే అయినా తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు అంటూ కన్నీళ్ళ పర్యంతమయ్యారు.చిన్నప్పటి నుండి చిన్నూఅల్లరి చేసినా బన్నూ మాత్రం నిశ్శబ్దంగా ఉండేవాడు.అందరికీ తలలో నాలుకలా ఉండే బన్నూ మన అందరి మధ్య లేడు అన్న విషయాన్ని స్నేహితులు,బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బన్నూ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.ఆలోటు ఎవరూ పూడ్చలేనిది.ఇంటికి పరామర్శించడానికి వచ్చిన బన్నూ స్నేహితుడి తల్లి మమ్మల్ని తీసుకెళ్ళు దేముడో!అని ఎదురు చూచే ముసలా ముతక బోలెడు మంది ఉండగా బాగున్నచిన్న పిల్లాడ్ని తీసుకెళ్ళి ఫోటోలోనికి ఎక్కించడం ఏమిటి?దేముడికి దయలేదు.పూజలు చేయించుకుని నివేదనలు పెట్టించుకోవడం తెలుసుగానీ అంటూ శాపనార్ధాలు పెడుతుంటే మిగిలినవాళ్ళు బిత్తరపోయారు.
No comments:
Post a Comment