Saturday, 14 January 2017

మనసుకు రీచార్జ్

                                                    చరవాణికి రీచార్జ్ ఉంటుంది కానీ ఈ మనసుకు రీచార్జ్ ఏమిటి అనుకుంటున్నారా?ఇది నిజం.జీవితం చాలా చిన్నది.ఆ చిన్ని జీవితంలో మనం సంతోషంగా ఉంటూ మన చుట్టూ ఉన్నవాళ్ళను కూడా సంతోషంగా ఉండేలా చూడగలగటం గొప్పతనం.ఇందులో అద్వైతలా ఎవరు ప్రయత్నించినా నిస్సారంగా అనిపించిన జీవితం మధురంగా అనిపిస్తుంది.అద్వైత చిన్ననాటి నుండి ఎంతో సంతోషంగా కిలకిలా నవ్వుతూ చూడగానే ఎత్తుకోవాలని అనిపించేలా ఉండేది.చిన్నప్పుడంటే చీకు చింత ఉండదు.కానీ వయసు మీద పడినా కూడా ముఖంపై అదే  చెరగని చిరునవ్వుతో చురుకుగా,హుందాగా,చూడగానే ఒక విధమైన ప్రశాంతతో ఉంటుంది.ఎంత కోపము,చిరాకులో ఉన్నవాళ్ళనయినా ఆమెను చూడగానే ఆమె మృదువైన మాటలు వినగానే సంతోషంగా అంతకు ముందు ఉన్న చిరాకు కోపం తగ్గి ప్రశాంతంగా అయిపోతారు.అందరికీ సలహాలు చెప్పి ఎదుటివాళ్ళ సమస్యలు తీర్చేఅద్వైత ఎందుకో ఈమధ్య నిస్సంతోషంగా,నిరాశ,నిస్పృహలతో ఉన్నట్లు ముఖంపై చిరునవ్వు అనేది లేకుండా కనిపిస్తోంది.అద్వైతకు వచ్చిన కష్టం ఏమీ లేదు.అయినా ఎందుకు అలా ఉంటుందో ఎవరికీ అర్ధం కాక తలలు బద్దలు కొట్టుకుని ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే దానివి ఆ నాటి నవ్వులు ఏవమ్మా?అంటూ కుటుంబసభ్యులు,స్నేహితులు,బంధువులు సరదాగా ఆట  పట్టించడం మొదలు పెట్టారు.అవును నిజంగానే ఎందుకు ఇలా తయారయ్యాను అని తనను తాను ప్రశ్నించుకుని సంతోషం అనేది మనసు బట్టే ఉంటుంది కదా!ఎంత త్వరగా మనసుకు రీచార్జ్ చేసుకుంటే అంత మంచిది అనుకుంది. అనుకున్నదే తడవుగా అద్వైత తోటలో ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని తన జీవితంలో సంభవించిన చిన్ననాటి నుండి నిన్న మొన్నటివరకు ఉన్న మధుర జ్ఞాపకాలను ఒక్కొక్కటి నెమరవేసుకుంటూ ఆమె  మనసును రీచార్జ్ చేసుకుని మళ్ళీ పూర్వపు అద్వైతలా చలాకీగా మారిపోయింది. 

No comments:

Post a Comment