Wednesday 20 November 2013

సుడిగుండం

               నాకు ఐదు సంవత్సరములు ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరు  వెళ్ళాము. చాలా అందమైన ఊరు .
అమ్మమ్మ వాళ్ళ రోడ్డులో అమ్మమ్మ వాళ్ళ ఇంటి ప్రక్కన వాళ్ళ అమ్మ ,నాన్న ఉండేవారు. కొంచెం అవతల అన్నయ్య ,తమ్ముడు వాళ్ళ ఇళ్ళు ఉండేవి .ఇరుగు పొరుగూ అందరూ కూడా చుట్టాలే .చాలా సరదాగా సందడిగా
ఉండేవారు.
               ఊరికి ఇంకొక ప్రక్కన అమ్మమ్మ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఉంది .వాళ్ళ ఇంటి వెనుక చిన్న కట్ట ఉంది
.దాని ప్రక్కన ఒక కాలువ ఉంటుంది .అప్పట్లో బల్లకట్టు ఎక్కి ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు వెళ్ళేవాళ్ళం.కాలువ
దాటగానే పెద్ద కట్ట ఉంది.పెద్ద కట్ట నుండి క్రిందకు దిగి కొంత దూరం పొలాలు ఉండేవి .అవి దాటిన తర్వాత
కొంతదూరం ఇసుకలో నడిచి వెళ్తే కృష్ణానది వస్తుంది .
              ఏటికి స్నానానికి వెళ్తున్నాం అనేవాళ్ళం. ఆ రోజు రధసప్తమి .ఊరిలో అందరూ చిన్నవాళ్ళు పెద్ద వాళ్ళతో సహా చాలా మంది వెళ్ళాము .అప్పట్లో మగవాళ్ళు కూడా కొంతమంది రక్షణగా వెళ్ళేవాళ్ళు .ఏటిలో దిగి సూర్యునికి
నమస్కరించి ఆడవాళ్లు పసుపు సూత్రానికి మొహానికి రాసుకుని మూడుసార్లునీళ్ళల్లో మునిగి తర్వాత ఈత
వచ్చినవాళ్లు ఈత కొట్టేవాళ్ళు.
                తర్వాత ఒడ్డుకి వచ్చి ఇసుకతో గౌరీ దేవిని చేసి బియ్యపు పిండి,పసుపు ,కుంకుమ ,పువ్వులు పెట్టి
 సాంబ్రాణి కడ్డిలు వెలిగించి అరటి పళ్ళు నివేదన పెట్టి హారతి వెలిగించి శివుని మేడలో నాగరాజా .....అనే పాట
పాడేవాళ్ళు.బొట్టు పెట్టుకొని తలా ఒక పువ్వు తలలో పెట్టుకొని కొంచెం ప్రసాదం తీసుకొని చేతులు కడిగి
గౌరీదేవిని అందరూ పట్టుకొని నీళ్ళల్లో వదిలేవారు .
               వీళ్ళు ఇలా ఎవరి హడావుడిలో వాళ్ళు ఉండగానే నలుగురు పిల్లలు కనిపించలేదని గమనించారు.
వాళ్ళు అందరూ పదిహేను సంవత్సరములు వయస్సు వాళ్ళే .వాళ్ళు రేగుపండ్ల కోసం  వెళ్లి ఉంటారని అనుకొని
వెతకడానికి మగవాళ్ళు వెళ్లారు .లంకలో రేగుపండ్లు చాలా బావుండేవి.అక్కడ కూడా పిల్లలు లేకపోయేసరికి
అందరూ ఏడవడం మొదలు పెట్టారు.
             కొంచం సేపటికి నీళ్ళల్లో కొంచెం దూరంలోగులాబీ రంగు కనిపించింది.ఈత వచ్చినవాళ్లు అక్కడకు
వెళ్లి చూస్తే అది ఒక సుడిగుండమనీ అందులో వాళ్ళు పడిపోయారని తెలిసింది.నలుగురిలో ఫై న వున్న
అమ్మాయి మాత్రమే బ్రతికింది .మిగతా ముగ్గురూ చనిపోయారు.అందరూ ఏడుస్తుంటే నేను తమ్ముడు
భయపడతామని అమ్మమ్మ మమ్మల్ని  తీసుకుని ఇంటికి వెళ్ళింది .ఇది  ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన.
  

No comments:

Post a Comment