Friday 29 November 2013

జాలీగా స్కూలుకు

               శ్రుతి ఊరిలో ఎలిమెంటరీ స్కూల్ మాత్రమే ఉండేది.ఆరు,ఏడు తరగతులు చదవాలంటే వేరే ఊరు
నడిచి వెళ్ళాల్సి వచ్చేది.ఒక పదిమంది పిల్లలు కలిసి వెళ్ళేవారు.దారిలో కబుర్లు చెప్పుకుంటూ,ఆడుకుంటూ
మధ్యమధ్యలో పరుగులు పెడుతూ వెళ్తూఉండేవారు.
                  దారిలో రకరకాల మొక్కలు,చెట్లు ఉండేవి.తంగేడుపువ్వులు కనిపించినప్పుడు పెట్టుకోకపోతే
మొక్కతిడుతుందని అందరూ అనేవారు.అందుకని ఆడపిల్లలు ఒకపువ్వు కోసి పెట్టుకోనేవాళ్ళు.జమ్మిచెట్టు
కనిపిస్తే ఆకుకోసి పుస్తకాలలోపెడితే టీచర్ తిట్టదని అందకపోయినా కష్టపడిమరీ కోసేవాళ్ళు.
                బలుసుకాయలు,బుడందోసకాయలు,చిన్నకామంచి,పెద్దకామంచి మొదలైన రకరకాలకాయలు
దొరికేవి.వాటికోసం అందరూ పరుగెత్తుకుంటూవెళ్లి ఎవరూ ముందువెళ్తే వాళ్ళు గొప్పగా ఫీలయ్యేవాళ్ళు.వాళ్ళే
కోసి కొన్నితీసుకుని మిగిలినవి అందరికీ ఇచ్చేవారు.అవి తినటానికి బావుండేవి.
                కొంచెం ముందుకు వెళ్తే పంటపొలాలు వచ్చేవి.ఒకఅమ్మాయి బెండకాయలు కోసుకుని తినేది.
కొంతదూరం వెళ్లినతర్వాత తుమ్మచెట్లు వచ్చేవి.తుమ్మలలో ఏదో వుందని భయపెట్టేవాళ్ళు.అందరూ కలిసి
ఒకటే పరుగు.తర్వాత పెద్ద చెరువు వచ్చేది.వర్షాకాలంలో రోడ్డుమీదకు నీళ్ళు వచ్చేవి.ఆనీళ్ళల్లోఆడుకుంటూ
జాలీగా స్కూలుకు వెళ్ళేవాళ్ళు.
               వచ్చేటప్పుడు చెరువులోచేపపిల్లలు ఉండేవి.వాటికి ఏదయినా వేస్తేఅన్నీ ఒక్కచోటకు వచ్చేవి.
వాటితో కాసేపు ఆడుకోనేవాళ్ళు.చెరువులో తామరపువ్వులు ఉండేవి.తామరపువ్వులంటే శ్రుతికి చాలా ఇష్టం.
అందరికన్నా శ్రుతి చిన్నపిల్ల.అందుకని ఏదయినా అడగగానే చేసేవాళ్ళు.శ్రుతికి వరుసకు అన్నయ్య చెరువులో
దిగి కోసిచ్చేవాడు.తుమ్మలదగ్గరకు రాగానే ఒకటే పరుగు.చెరకుతోట దగ్గరకు రాగానే మగపిల్లలు చెరుకులుతీసి
ఇచ్చేవాళ్ళు.అందరూ తినేవాళ్ళు.కందితోట దగ్గరకు రాగానేకందికాయలు కోసుకుని తినేవాళ్ళు.అలా ఆడుకుంటూ
సాయంత్రం ఇంటికి వెళ్ళేవాళ్ళు.



No comments:

Post a Comment