Tuesday 7 April 2015

బుడంకాయ

                                               కనకమ్మ చిన్నగా బుడంకాయ లాగా ఉంటుంది.భర్త ఆజానునుబాహుడి లాగా ఉంటాడు.కనకమ్మ చదువు తక్కువైనా తెలివిగలది.భర్తను చుట్టచుట్టి గుప్పెట్లో పెట్టుకుంది.భర్తనే కాక భర్త తరఫు
వారందరినీ తన అధీనంలో ఉంచుకోవాలని ఆమె కోరిక.ఒకళ్ళో,ఇద్దరో ఉన్నా అందరికీ ఆవిధంగా ఇష్టం ఉండదు కదా!అందుకోసం ఆమె తీవ్రంగా ప్రయత్నించేది.సంవత్సరానికొకసారి అత్తారింటికి వచ్చినప్పుడల్లా తను చేస్తున్నట్లుగా అందరూ అనుకోకుండా భర్తకు కీ ఇచ్చి వదిలేది.భర్త అందరితో మంచిగా మాట్లాడుతూనే నన్ను ఎవరూ లేక్కచేయడం లేదంటూ  ఏదోరకంగా తగువు పెట్టుకునేవాడు.ఆసమయంలో ఏనాడూ తిన్న పళ్ళెం కూడా కడగని కనకమ్మ వంటగదిలో కొచ్చి ఎక్కడలేని సంతోషంతో పచ్చడి చేస్తానని రోట్లోవేసి బండతో చకచకా నూరేది.మేనకోడలు కూతురు చిన్నది విచిత్రంగా చూస్తూ ఎదురుగా కూర్చుని పచ్చడి చేసేవిధానం ఆసక్తిగా చూస్తుండేది.ఒకటి,రెండుసార్లు గమనించి కనకమ్మ అందరూ  మాట్లాడేటప్పుడే ఎందుకు పచ్చడి చేస్తుంది?అని వాళ్ళమ్మను అడిగింది.కనకమ్మకు అదొక సరదా అని వాళ్ళమ్మ చెప్పింది.కనకమ్మ భర్త వెనకుండి ఇదంతా చేస్తుందని తెలిసినా,భార్య మాటవిని మాట్లాడుతున్నాడని తెలిసినా ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు.పాపం మనం కూడా మాట్లాడితే ఇద్దరి మధ్య నలిగిపోతాడని వదిలేసేవాళ్ళు.ఎవరూ ఎదురు మాట్లాడలేదు కనుక విజయం సాధించానని బుడంకాయ లాంటి కనకమ్మ,భర్తతోపాటు అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నానని  పరమానందపడేది.తర్వాత యధా రాజా తధా ప్రజా అన్నట్లు ఎవరి దోవ వాళ్ళదే.   

No comments:

Post a Comment