Tuesday 21 July 2015

పట్టువదలని విక్రమార్కుడు

                                             శ్వేతాదేవి గారికి డెబ్భై సంవత్సరాలు.విదేశాలలో ఉన్న తనవాళ్ళను చూడటానికి కుటుంబసమేతంగా వెళ్లారు.మేనమామ కొడుకు తనింటికిరావాల్సిందిగా అందరినీ ఆహ్వానించాడు.వాతావరణం సరిగాలేని కారణంగా విమానం చేరుకోవాల్సిన ప్రదేశం కన్నా ముందే దించేశాడు.కాస్త ఇబ్బందిపడి ఎట్టకేలకు శ్వేతాదేవిగారు ఏడుగంటల అనంతరం అసలు విమానాశ్రయానికి చేరుకున్నారు.అనుకున్న ప్రకారం మేనమామ కొడుకు వర్షంలోనే విమానాశ్రయానికి చేరుకున్నాడు.ఏడుగంటలు నిరీక్షించి అర్థరాత్రి వర్షంలోనే ఇంటికి తీసుకెళ్ళాడు.భార్యాభర్తలిద్దరూ ఎంతో ప్రేమగా అన్నివసతులు ఏర్పాటు చేసి దగ్గరుండి మరీ చూడవలసిన ప్రదేశాలన్నీ చూపెట్టారు.ప్రణాళిక ప్రకారం అన్నీ చూపించలేక పోతున్నానని బాధపడి వీలయినవన్నీతిప్పిచూపించి చివరకు నగరం మొత్తం కనిపించే విధంగా నదీవిహారానికి తీసుకెళ్ళాడు.బయట విపరీతమైన చలి.వద్దన్నా వినకుండా నదీవిహారం చేస్తూ దీపాల కాంతిలో నగరాన్నివీక్షించడం చాలా అద్భుతంగా ఉంటుందని మేనత్తకూతురికి ఎలాగైనా దాన్ని చూపించాలని ఆమె కార్ పార్కింగ్ నుండి నడవటం కష్టమని బోటు ఎక్కవలసిన ప్రదేశం వరకు దారి కనుక్కుని పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించాడు.శ్వేతాదేవిగారు తనకు శ్రమ కలగకుండా తీసుకెళ్ళడానికి పడ్డ కష్టానికి తగినట్లుగానే నదీవిహారం చేస్తూ నగరం మొత్తాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉందని మేనమామ కొడుకుని మెచ్చుకున్నారు.  

No comments:

Post a Comment