సుప్రజ ఇల్లు మూడు అంతస్తుల భవనం.ఒకదానిలో ఇంటి యజమాని ఉంటూ మిగతా రెండు అద్దెకు ఇచ్చారు.ఒకదానిలో సుప్రజ కుటుంబం ఉంటుంది.కొత్తగా కట్టుకున్నారు కదా!అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచాలనే తాపత్రయంతో ఎప్పుడంటే అప్పుడు ఆయన ట్యూబు పెట్టి నీళ్ళు కొడుతుంటే ఆవిడ స్పాంజి పెట్టి గోడలు రుద్దుతుంది.ఇంటి లోపల,బయట,మెట్లు కూడా కడుగుతుంటారు.ఈ కార్యక్రమంలో భాగంగా బయట గోడలు కడుగుతుంటే కిటికీలో నుండి ఇంట్లోకి నీళ్ళు మెట్లు కడుగుతుంటే వరండాలోకి,చుట్టూ బాల్కనీల్లోకి నీళ్ళు వచ్చేస్తుంటాయి.పనివాళ్ళు వచ్చేదాకా ఉంటే ఈలోపు ఎవరో ఒకళ్ళు జారి కింద పడటం ఖాయం.ఈరోజుల్లో పనివాళ్ళు మాత్రం ఎవరు చేస్తున్నారు?అందుకే చూస్తూ ఊరుకోలేక సుప్రజ తుడవటం మొదలుపెడితే రెండు గంటలు సమయం వృధా.ఒకపక్క తాగేందుకు గుక్కెడు నీళ్ళు లేక జనం ఇబ్బంది పడుతుంటే నీళ్ళు వృధా చెయ్యడమే కాక ఎదుటి వాళ్లను ఇబ్బంది పెడుతున్నామనే ఆలోచనే లేదు.ఇద్దరికీ విపరీతమై చాదస్తం.భగవంతుడు ఒకే మనస్తత్వం ఉన్న వాళ్ళనే ఒనగూరుస్తాడు.లేకపోతే కలిసి ఉండలేరు కదా!వీళ్ళ చాదస్తానికి ఎదుటి వాళ్ళు బలి అవ్వాల్సిందే.అద్దె చూస్తే పాతిక వేలు.వీళ్ళ బాధ పడలేక ఆరునెలలకి,సంవత్సరానికి ఒక్కొక్కసారి నాలుగు నెలలకు ఇల్లు ఖాళీ చేస్తుంటారు.అయినా వీళ్ళ చాదస్తపు పనులు మానరు.
No comments:
Post a Comment