Friday, 11 September 2015

పేదోళ్ళని తెలిసి.......మళ్ళీ రాలేను

                                                 ఐశ్వర్య తండ్రి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినా కాలం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాడు.ఐశ్వర్య పెళ్ళి వయసు వచ్చేటప్పటికి చదువు,అందం అంతంతమాత్రంగా ఉన్నా గర్వం మాత్రం నిలువెల్లా ఉంది.అందుకని తండ్రి డబ్బులేకపోయినా చదువుకున్నవాడికి,నెమ్మదస్తుడికి పిల్లనిస్తే కూతురు ఆడింది ఆట,పాడింది పాట అన్నట్లుగా జీవితం సాగిపోతుందని అనుకున్నాడు.అనుకున్నట్లుగానే దూరపు బంధువులలో వైద్యవిద్య అభ్యసించిన కుర్రాడు ఉన్నాడని తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళి ఖర్చుల నిమిత్తం భారీగా వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చాడు.పిల్లాడికి,తండ్రికి అక్కడి నుండి కష్టాలు మొదలు అయ్యాయి.వీళ్ళంటే లేక్కలేనట్లు ప్రవర్తించటం మొదలెట్టారు.పిల్లాడు మొదట్లో పూర్తిగా వినకపోయినా తర్వాత అతనికి వాళ్ళ మాటే వేదం అయింది.కొన్నేళ్ళ తర్వాత ఒక నెల రోజులు మాదగ్గర ఉండమని తీసుకెళ్ళారు.ఈ నెలరోజుల్లో కోడలు మాటలతో మామగారి మెదడు తినేసింది.మీరు పేదోళ్ళని తెలిసి కూడా మీ కొడుకుతోపాటు,మీరు మా చెప్పుచేతల్లో ఉంటారని అంత డబ్బిచ్చి కొనుక్కున్నాము అనేసరికి వింటున్న పెద్దాయన తల తిరిగిపోయింది.అయ్యో!ఇన్నాళ్ళు కొడుక్కి పెద్దింటి పిల్లతో పెళ్ళి చేశాననుకున్నాను కానీ కొడుకును అమ్మేసుకున్నానని అనుకోలేదు అనుకున్నాడు.ఏమీ ఎరగనట్లు మళ్ళీ ఎప్పుడు వస్తారు మామయ్యా? అని దీర్ఘం తీసింది..మనసులో నీకో దండం అనుకుని అమ్మా!నేనిక్కడ చలికి తట్టుకోలేను అందుకని మళ్ళీ రాలేను అని చెప్పాడు.

No comments:

Post a Comment