Friday 8 August 2014

శ్రావణ శోభ

                      శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మీ వ్రతకాలం.శ్రావణ మాసంలో అన్నిశుక్రవారాలు వేరు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ప్రాధాన్యత వేరు.లక్ష్మీదేవి వరాలు ప్రసాదించే తల్లి కాబట్టి ఈరోజు వరలక్ష్మీదేవిగా కొలిచి
వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాము.లక్ష్మీ అనే మాటలోనే అద్భుతభావాలున్నాయి.అందరినీ చల్లగాచూచే తల్లి,అందరికీ లక్ష్యమైన ఐశ్వర్యం,ఆనందాల రూపమే లక్ష్మీదేవి.స్త్రీలందరూ లక్ష్మీ స్వరుపులే.అందుకే స్త్రీ ప్రాధాన్యం కలిగిన పర్వం.
ఈరోజు గృహాలు,గృహిణులు,గృహలక్ష్మీ కళతో శోభిల్లుతూ వరలక్ష్మీవ్రతం చేసుకొనటం సంప్రదాయం.ఈరోజు స్త్రీలు   ఇరుగు,పొరుగు,ఒకరినొకరు లక్ష్మీరూపులుగా భావిస్తూ వాయనాలు అందిచడం,పసుపు,కుంకుమలు ఒకరికొకరు పంచుకోవడం దివ్యానుబంధాలను పటిష్టంచేస్తాయి.ఈరోజు అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ప్రత్యేకం.మిగిలిన నైవేద్యాలు ఎన్నిచేసినా తొమ్మిది పూర్ణాల వాయనం ముఖ్యమైనది.తొమ్మిది ముడులతో వేసిన తోరము అమ్మవారి దగ్గర పెట్టి కట్టుకోవటం ప్రత్యేకమైనది.క్రొత్తగా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసిన ఇళ్ళల్లో వియ్యాలవారినీ,బంధువులందరినీ పిలిచి ఈ
వ్రతం చేస్తారు కనుక సందడే సందడి.మామిడితోరణాలు,పసుపు,కుంకుమతో గడపలు,రకరకాల పువ్వులతో అమ్మవారి అలంకరణ చూడటానికి రెండుకళ్ళు చాలవన్నట్లు ఉంటుంది.పట్టుచీరెల రెపరెపలు,రకరకాల నగలతో నిండుగాఉన్న ముత్తైదువల హడావిడి పూర్తి శ్రావణ శోభను సూచిస్తుంది.ఈపూజకు చామంతిపువ్వులు ప్రత్యేకం.                                                                              మిత్రులందరికీ,గృహిణులకు వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు. నాబ్లాగ్  వీక్షకులందరికీ ఆయురారోగ్యాలను,ఐశ్వర్యాన్ని ప్రసాదించమని ఆ వరలక్ష్మీ దేవిని మనసారా  ప్రార్ధిస్తున్నాను.  

No comments:

Post a Comment