సుజిత ఉండే రోడ్డులో ఒకరోజు చింపిరిజుట్టుతో,మురికిబట్టలతో మూడుచక్రాల సైకిలుమీద ఒకడు కనిపించాడు.పెళ్ళికి వెళ్ళటానికి తయారయి గేటు దగ్గరికి రాగానే అకస్మాత్తుగా వచ్చి చెయ్యి చాచేసరికి ఒక పది రూపాయలు ఇచ్చింది.రెండు రోజుల తర్వాత హడావిడిగా వెళ్తుంటే రోడ్డు ప్రక్కన కూర్చుని కర్ర దారికి అడ్డం పెడుతున్నట్లుగా పెట్టాడు.సుజిత పెద్దగా పట్టించుకోలేదు కానీ ఏమీఇవ్వకుండా వెళ్తున్నారని కోపంగా మొహం పెట్టినట్లు అనిపించింది.ఒకరోజు మధ్యాహ్నం రోడ్డుమీద పెద్ద గొడవ జరుగుతుంది.ఏంటోనని చూచేసరికి ఒక భార్యాభర్తలు కర్రతో వాడిని కొడుతూ పెద్దగా అరుస్తున్నారు.ఇంతకీ విషయమేమిటంటే ఒకామె పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇవ్వటానికి బండి మీద వెళ్తుంది.వీడు పెద్ద రాయి తీసుకుని ఆమె నడుముకి గురిచూసి కొట్టాడు.ఆమె అకస్మాత్తుగా క్రింద పడిపోయింది.అప్పటివరకు ఆమె వీడిని చూడలేదు.ఒంటిమీద బట్టలు సరిగా లేకుండా ఆమెను రా అంటుంటే దారిన పోయేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆగకుండా వెళ్ళిపోయారు.ఆమెకు చిన్నచిన్న దెబ్బలు తగిలాయి.నడుము దగ్గర గట్టిదెబ్బ తగిలింది.నిదానంగా లేచి భర్తకు ఫోను చేసి వెంటనే రమ్మని చెప్పగానే వచ్చాడు.విషయం చెప్పి చెరొక కర్ర తీసుకుని కొడుతుంటే ఇళ్ళల్లో నుండి ఆడవాళ్ళందరూ వచ్చి తలొక దెబ్బ వేసి రాయితీసుకుని వాడెలాగురిచూసి కొట్టాడో అలాగే నువ్వు కూడా గురిచూసి అక్కడ కొట్టమని చస్తాడు మళ్ళీ ఎవరినీ వెధవ కూతలు కుయ్యకుండా ఉంటాడని అందరూ ఒకేమాట చెప్పారు.అప్పటికీ వాడిలో పశ్చాత్తాపం కనపడలేదు కానీ ఆడవాళ్లందరూ కలిసి అన్నంతపనీ చేసేట్లున్నారని దణ్ణంపెట్టి తప్పయిందని తప్పిచుకుందామనుకున్నాడు.కాళ్ళు చచ్చుపడిపోయినా మదమాత్సర్యం తగ్గలేదని,దారిలో వెళ్ళే పనివాళ్ళను అలాగే మాట్లాడుతున్నాడని తర్వాతతెలిసింది.భర్త,ఇంకొందరు మగవాళ్ళు కలిసి చితక్కొట్టి కంటికి కనిపించావోచంపేస్తామని గట్టిగా బెదిరించారు.బాబ్బాబు తప్పయిందని,అమ్మా!క్షమించమని ఆమె కాళ్ళ మీద పడబోయాడు.చీ!ఇదొక దొంగ నాటకం.నువ్వు క్షమార్హుడివి కాదుఅయినా కాళ్ళు చచ్చుపడిపోయి నడవలేని స్థితిలో ఉన్నావని ఏమూలో ఉన్నజాలితో వదిలేస్తున్నానని చీత్కరించి కాళ్ళు వెనక్కి తీసుకుంది.పోలీసులకు ఫోను చేస్తుంటే చక్రాల సైకిల్ తో వేగంగా పారిపోతుంటే వెంటపడే సరికి ప్రక్కన ఉన్న కాలువలో పడ్డాడు.వాడిని ఎవరూ దగ్గరికి వెళ్ళి పట్టుకోలేనంత అసహ్యంగా వాడి బుద్దిలాగే ఆకారం కూడా ఉంది కనుక వదిలేశారు.చచ్చాడో,బ్రతికాడో కూడా పట్టించుకోలేదు.ఎందుకంటే ఇటువంటి వాళ్ళ మీద జాలిపడాల్సిన అవసరంలేదని అందరి అభిప్రాయం.
No comments:
Post a Comment