సునందిని కుటుంబసభ్యులకు చలికాలంలో కొంచెం మిరియాలపొడి వేసుకుని ఏదోఒక సూప్ తాగటం అలవాటు.సమయాభావం వల్ల ఇంట్లో తయారు చేయలేకపోయింది.పెద్దవాళ్ళకు ప్రతి రోజు తప్పనిసరిగా సూప్ ఇవ్వాలి కనుక ఏమి చేయాలో తెలియక మొన్నామధ్య కొట్టుకు వెళ్ళినప్పుడు పొడి వేసి వేడి నీళ్ళు పోస్తే నిమిషంలో సూప్ తయారైపోతుందని వద్దో మొర్రో అన్నా రెండు పాకెట్లు షాపులో అమ్మాయి అంటగట్టింది.నిమిషంలో తయారు చేసేయ్యవచ్చు కదా అని సంబరపడి కప్పులో పొడి వేసి వేడినీళ్ళు పోసి గిరగిరా స్పూనుతో తిప్పేసి ఎందుకైనా మంచిదని కొంచెం రుచి చూచేసరికి ఘాటుగా,కారంగా(పచ్చిమిర్చిఘాటు)నషాళానికి అంటింది.ఆ ఘాటు తగ్గటానికి పచ్చికారట్ తురుము,ఎండుద్రాక్ష చిటికెడు ఉప్పు,పంచదార వేసి ఇంట్లో వాళ్లకు ఇచ్చింది.వాళ్ళకసలే ఘాటుగా అలవాటు లేదు.ఒక స్పూను తాగేసరికే చనిపోయిన అమ్మ గుర్తువచ్చిఅయ్యబాబోయ్ అనటానికి బదులుగా "అమ్మబాబోయ్" ఇది మేము తాగలేము అంటూ పారబోశారు.నీకు సమయం లేకపోతే ఒకరోజు ఇవ్వక పోయినా ఫరవాలేదు కానీ ఇటువంటివి ఇవ్వొద్దు అని ముక్తాయింపు ఇచ్చారు.నిజం చెప్పొద్దూ కారం ఎక్కువ తినే అలవాటున్న సునందిని కూడా తాగలేకపోయింది.
No comments:
Post a Comment