Friday 14 November 2014

లక్ష బిల్వార్చన

                                       బిల్వం అంటే మారేడు దళం.శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది.భక్తితోఒక్క మారేడు దళం సమర్పించినా భోళాశంకరుడు ప్రసన్నుడవుతాడు.శివుడు భక్తసులభుడు.కార్తీక మాసంలో మారేడు దళాలతో పూజ
చేయటం ఎంతో మంచిది.శివాలయాల్లో రుద్రాభిషేకాలు ఎంత ప్రత్యేకమో బిల్వార్చన అంటే మారేడు దళాలతోఅర్చన చేయటం కూడాఅంతే ప్రత్యేకం.లక్ష బిల్వదళాలు సమకూర్చటం ఎంత కష్టమో,మరల ఒక్కొక్క దళం అంటే మూడు ఆకులు కలిసి ఉన్నవి,మంచిగాఉన్నవాటిని మాత్రమే ఏరటం కూడా అంతే కష్టం.ఎంతోమంది భక్తులు భక్తి భావంతో శ్రమపడి ఇవన్నీసమకుర్చుతారు.అమృత ఊరిలో పార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది.ఈగుడిలో నాగేంద్రుడు రాత్రిపూట శివలింగాన్ని చుట్టుకుని ఉంటాడు.కోరిన కోర్కెలు తప్పక నెరవేర్చే ఈస్వామి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. పాతిక సంవత్సరాల క్రితం నుండే కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం స్వామికి లక్షబిల్వార్చన,అమ్మవారికి లక్ష కుంకుమార్చన  కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఎంతోమంది బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణల మధ్య లక్ష బిల్వార్చన కార్యక్రమం తెల్లవారుఝామున 3గం.ల నుండి సాయంత్రం వరకూ దిగ్విజయంగా కన్నులపండువగా జరుగుతుంది.భక్తజన సందోహంతో ఆప్రాంతం కిటకిటలాడిపోతుంది.శివనామ స్మరణతో ఆప్రాంతమంతా మార్మోగిపోతుంది.101జంటలు(దంపతులు)పూజలో పాల్గొంటారు.చుట్టుప్రక్కల నుండి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు.ఈ గుడిలోకార్తీకమాసంలో ప్రతిరోజూ తెల్లవారుఝామున 3 గం.లనుండే రుద్రాభిషేకాలు జరుగుతుంటాయి.భక్తులు తెల్లవారుఝాము నుండే వచ్చి నిత్యాదీపారాధన చేస్తుంటారు.   లక్షఒత్తులు,కోటి ఒత్తులు వెలిగించడానికి చుట్టుప్రక్కలవాళ్ళు వస్తుంటారు.కార్తీకమాసం చివరివారంలో ఒకరోజు అన్నసమారాధన విందు భోజనాల కన్నా ఘనంగా నిర్వహిస్తారు.ఈకార్యక్రమానికి కూడా చుట్టుప్రక్కల ఊళ్ళనుండి స్వామి ప్రసాదం తీసుకోవటం అదృష్టంగా భావించి స్వీకరిస్తారు.    

No comments:

Post a Comment